స్నేహం: మనిషి మనసుతో సృష్టించుకున్న అపూర్వ అనుబంధం
- Hashtag Kalakar
- Aug 13
- 2 min read
By Nanubolu Rajasekhar
స్నేహం... ఓ మధురం
స్నేహం... ఓ ధైర్యం
స్నేహం... ఓ త్యాగం
స్నేహం... ఓ సంబరం
షరతులేమి లేనిదే...స్నేహం
కష్ట సుఖాల్లో తోడుండేదే...స్నేహం
హోదా, కులమతాలు లేనిదే...స్నేహం
వయస్సు, లింగబేధాలు లేనిదే...స్నేహం
మంచిని బోధించి దారి చూపేదే...స్నేహం
మందిలించి బాగోగుల్ని చూసేదే...స్నేహం
కలత చెందిన మనసుకి దివ్య ఔషధమే...స్నేహం
కంటికి దూరమైనా మనసుకు దగ్గరుండేదే…స్నేహం
బాల్యం నుంచి జీవితకాలం తోడుండేదే...స్నేహం
భగవంతుడు కుటుంబ బంధాన్ని సృష్టిస్తే...
మనిషి స్నేహ బంధాన్ని సృష్టించాడు.
అదృష్టమైన అనుబంధమే... ఈ స్నేహం
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం...స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…కడదాక నీడలాగ నిను వీడి పోదురా...అంటూ కవులు రాసిన కవితాసుధ స్నేహానికి ఉన్న విశిష్టతను ఎన్ని విధాలుగా కొనియాడినా కూడా…ఆ స్నేహబంధంలోని మధురానుభూతి వర్ణింప శక్యం కానిది. స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన అనేక చలన చిత్రాలు ఘనవిజయాలను సాధించి, కనకవర్షాన్ని కురిపించడానికి ప్రధాన కారణం సమాజంలో స్నేహ బంధంపై ఉన్న ఉన్నతమైన భావనే. కృష్ణకుచేలులు, కర్ణదుర్యోధనులు, అన్నదమ్ములైనా స్నేహితులుగా కడదాకా జీవితాన్ని సాగించిన రామలక్ష్మణులు మన పురాణ ఇతిహాస స్నేహితులు.
నియమ నిబంధనలు, ప్రణాళికలు, ఎల్లలు లేనిదే...స్నేహం:
స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే నిర్ధిష్టమైన నియమ నిబంధనలు, ప్రణాళికలు, అంచనాలు ఏమి స్నేహితుల మధ్య ఉండవు. స్నేహానికి వయసుతో, కులమతాలతో, స్థితిగతులతో, లింగభేదంతో, ఎల్లలతో సంబంధం ఉండదు.ఎవరి మధ్యనైనా స్నేహం చిగురించవచ్చు. అలా చిగురించిన స్నేహాన్ని ఎలాంటి వ్యత్యాసాలను, తారతమ్యాలను చూపించి మాన్పించలేము. ఒకసారి ఏర్పడ్డ స్నేహం చిన్నచిన్న కష్టాలు, కలతలు, అపార్ధాలు వచ్చినా కూడా తిరిగి మరింత పట్టిష్టమై జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కులమతాల తారతమ్యాలు, స్థితిగతుల వ్యత్యాసాలను చూపి స్నేహాన్ని వదులుకోమన్నా కూడా వదలకుండా కొనసాగించిన అనుభవాలు, జ్ఞాపకాలు మన మధ్యనే ఎన్నో ఉన్నాయి.
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క బంధంలా మారగలిగే శక్తి ఉన్నదే...స్నేహం:
స్నేహబంధం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క బంధం లాగా తన రూపాన్ని మార్చుకుని ప్రవర్తించగల శక్తివంతమైనది. ఒకసారి గురువులా మారి మంచిని బోధించి మంచి మార్గాన్ని చూపిస్తుంది. మరొకసారి తల్లిదండ్రుల్లాగా మారి మంచి చెడులను విశ్లేషించి వివరంగా చెప్పి, మందిలించి మన బాగోగుల్ని చూస్తుంది.కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించి ధైర్యాన్నిచే దివ్య ఔషధంగా మారుతుంది. మన సంతోషంలో నవ్వుగా మారి మనల్ని నవ్విస్తుంది.బాధలో దుఃఖంగా మారి మన దుఃఖంలో సగపాలు పంచుకుంటుంది.చివరికి ఎంత త్యాగానికైనా సిద్ధపడే మరువలేని అనుబంధంగా మారుతుంది ఈ స్నేహం.
కంటికి దూరమైనా మనసుకు దగ్గరుండేదే... స్నేహం:
బాల్యంలో, ప్రాథమిక విద్యలో, తెలిసి తెలియని వయసులో ప్రారంభమైన స్నేహం కట్టె కాలే వరకు మనతోనే నడుస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల జీవిత ప్రయాణంలో మన కంటికి దగ్గరగా లేకపోయినా... మన మనసుకు దగ్గరగా ఉంటూ... అండగా ఉంటూ... మనకు ధైర్యం చెప్పేదే స్నేహం. బాధకైనా... సంతోషానికైనా... విషయం తెలిసినంతలోనే ఎంత దూరాన ఉన్నా కూడా సమయం తీసుకోకుండా మన ముందుండే ఆత్మీయ బంధమే ఈ స్నేహం. బాల్యంలో పరిచయమైన స్నేహితులందరూ వృద్ధాప్య ఛాయలు వచ్చినా కూడా ఎన్ని పనులున్నా ఆపుకుని " పూర్వ స్నేహితుల కలయిక" లను ఏర్పాటు చేసుకునే ఉన్నతమైన సంప్రదాయాన్ని సమాజంలో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అదే స్నేహానికి ఉన్న విడదీయలేని అనుబంధం. అలాంటి కలయికలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.
అమ్మ తరువాత మనసిప్పి మాట్లాడుకునే ఆత్మీయ బంధమే... స్నేహం:
ఈ సృష్టిలో బాల్యం నుండి యుక్త వయసు వరకు ధైర్యంగా ఆప్యాయంగా మనసులోని సంతోషాలను బాధలను వ్యక్త పరచుకునే ఆత్మీయ బంధం అమ్మ. యుక్త వయసులో మన చుట్టూ కుటుంబ బంధాలు ఎన్ని ఉన్నా కూడా మనం ఎవరికీ చెప్పుకోలేని బాధలను మొట్టమొదటిగా ధైర్యంగా ఏమి దాచుకోకుండా వ్యక్తపరచుకునే ఏకైక బంధం ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది తప్పకుండా స్నేహమే అయ్యింటుంది. మన సంతోషంలో సంతోషమై బాధలో బాధై మన అడుగులో అడుగై నడిచేదే ఈ స్నేహం.
దేవుడు కుటుంబాన్ని సృష్టిస్తే... మనిషి స్నేహితుడిని సృష్టించుకున్నాడు:
మనం ఈ భూమి మీద జన్మించిన తర్వాత అనేక బంధాలు మన చుట్టూ ఏర్పడతాయి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక బంధాలను, బంధుత్వాలను మన ప్రయత్నం, ప్రమేయం, ఇష్టం, ఎంచుకునే వెలుసుబాటు లేకుండానే ఆ భగవంతుడే మనకు కల్పిస్తాడు. అంతేకాదు, మన గురువులు, జీవిత భాగస్వాములు కూడా తల్లిదండ్రుల నిర్ణయాల మేరకే మనకు పరిచయం అవుతారు. కానీ, మనకు ఉగ తెలిసిన తర్వాత మన అభిరుచులకు, మనస్తత్వానికి దగ్గరగా ఉండి, మన మనసుకు నచ్చిన స్నేహితుడిని మాత్రం మనమే ఎంచుకుంటాము. ఈ భూమి మీద మనకు మనమే సొంతంగా ఎంచుకునే బంధం ఏదైనా ఉందింటే... అది తప్పకుండా స్నేహబంధమే. అందుకే ప్రతి మనిషికి అతని స్నేహితుడు ఎప్పుడూ ప్రత్యేకమే.
కుటుంబ బంధాల్లో కూడా స్నేహబంధం ఉంటుంది:
స్నేహం అనేది కొత్తగా పరిచయమైన ఇద్దరు వ్యక్తుల మధ్య, విద్యార్థుల మధ్య లేదా సహోద్యోగుల మధ్య మాత్రమే ఏర్పడే బంధమే కాదు. భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, బంధుల మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడుతుంది. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కుటుంబ బంధాల మధ్య స్నేహబంధం ఉంటే, సమస్యలు తీవ్ర రూపం దాల్చక ముందే పరిష్కారమై, ఆ కుటుంబం మరింత పటిష్టంగా ఉంటుంది. అందుకే కుటుంబ బంధాలు స్నేహబంధంతో పెనవేసుకొని ఉండాలి.
‘
స్నేహితుల దినోత్సవం మూల చరిత్ర:
1930లో యునైటెడ్ స్టేట్స్ కి చెందిన హల్ మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డే భావనను ప్రతిపాదించారు.అయితే, దీని వెనుక వ్యాపార దృక్పథం ఉండటంతో ఈ ప్రతిపాదన అంతగా ప్రాచుర్యం చెందలేదు.1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని“ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే” గా ప్రకటించిందనేది కొందరి వాదన.1958లో, పరాగ్వే మనస్తత్వవేత్త మరియు విద్యావేత్త అయిన డాక్టర్ ఆర్టెమియో బ్రాచో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించిన తర్వాత ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకునే సాంప్రదాయం గణనీయంగా పెరిగిందనేది మరికొందరి వాదన. ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 27, 2011న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. UN జనరల్ అసెంబ్లీ జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలు వివిధ తేదీల్లో జరుపుకుంటున్నాయి. భారతదేశం మరియు అమెరికా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం నాడు ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
స్నేహితుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం:
ఈ విశ్వంలో అనేక వైవిధ్యాలు కలిగిన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాలు, నగరాలు, వీధులు, కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటికీ జీవన సరళిలో, కట్టుబొట్టులో, భాషలలో, యాసలలో, సంస్కృతిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నింటా చూసినా అనేక భిన్నత్వాలు మనకు కనబడతాయి. అలాంటి భిన్నత్వాలలో ఏకత్వాన్ని తీసుకురాగల ఏకైక బంధమే ఈ స్నేహం. ప్రపంచ దేశాల ప్రజలకు స్నేహ బంధానికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసి వారిలో మనమందరం స్నేహితులమే అనే భావన కల్పించి ప్రపంచ శాంతిని నెలకొల్పడమే ఈ ప్రపంచ స్నేహితుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని గుర్తించడం ద్వారా శాంతి మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడంలో స్నేహం యొక్క ఔచిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నందున, శాంతియుత సంబంధాలను కొనసాగించడం చాలా కీలకం. స్నేహా భావాలను పెంపొందించడం ద్వారా దేశాల మధ్య పరస్పర అవగాహన పెరిగి శాంతియుత వాతావరణం నెలకుంటుంది. ప్రపంచ శాంతి మరియు స్థిరత్వం యొక్క విస్తృత లక్ష్యానికి ఈ "స్నేహితుల దినోత్సవం" దోహదం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మనిషి సృష్టించిన సామాజిక విప్లవ బంధమే... స్నేహం:
మనిషి సృష్టించుకున్న స్నేహ బంధాన్ని ఒక సామాజిక విప్లమని చెప్పవచ్చు ఎందుకంటే, ఒక కుటుంబంలో ఉన్న సమస్యలను ఆ కుటుంబానికి చెందిన స్నేహితులు, ఒక వీధిలో ఉన్న వైశ్యామ్యాలను ఆ వీధిలో స్నేహబంధం ఉన్న యువకులు , రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వైరాలను ఆ ఇరు రాష్ట్రాలలో స్నేహం కలిగిన నాయకులు , రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధ మేఘాలను, ఆ దేశాలను పరిపాలించే నాయకుల మధ్య ఉన్న స్నేహభావం పరిష్కరించిన సంఘటనలు చరిత్ర పుటలలో ఎన్నో ఉన్నాయి. ఒకసారి మనం క్రీస్తు పూర్వం చరిత్రను గుర్తు చేసుకున్నా కూడా స్నేహ సంబంధాలను కలిగి ఉన్న రాజ్యాలు, ప్రజలు సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించారని చదువుకున్న చరిత్ర పాఠాలను మనం మర్చిపోలేము. అందుకే స్నేహం అనేది మనిషి సృష్టించుకున్న ఒక సామాజిక విప్లవ బంధం.
విశిష్టమైన వ్యాసానికి అమూల్యమైన ముగింపు మాట:
రక్తసంబంధం కాకపోయినా...రక్తం చిందించడానికైనా...వెనుకాడనిదే...ఈ స్నేహం.స్నేహంలో నిజమైన స్నేహం, అబద్ధమైన స్నేహం అనే రెండు రకాల స్నేహాలు ఉండవు. స్నేహమంటేనే... నిజమైనది, స్వచ్ఛమైనది మరియు కపటం లేనిది. అసత్యమైనది, కపటమైనది మరియు అస్వచ్ఛమైనది స్నేహమే కాదు. కొందరి జీవితాలలో బాల్యంతో మొదలైన స్నేహం జీవితపు చివరి అంచుల వరకు కొనసాగుతూనే ఉంటుంది. మరికొందరి జీవితాలలో వృద్ధాప్యంలో కొత్త స్నేహాలు చిగురించి, భరోసాగా నిలుస్తాయి.ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం చెప్పి ఓదార్చే నేస్తం ఉన్నాడనే నమ్మకమైన ఆలోచన మనకు కొండంత ధైర్యాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే స్నేహితుడు ఎంత దూరంగా ఉన్నా కూడా మనకు మాత్రం దగ్గరగానే ఉన్నాడనే అనుభూతి, అనుభవమే కలుగుతాయి.కష్టంలో, సుఖంలో, బాధలో మరియు సంతోషంలో నేనున్నానని నిలబడే స్నేహితుడు దొరకటం ఒక గొప్ప అదృష్టం. అందుకే స్నేహబంధం అదృష్టమైన అనుబంధం. ఇంత విశిష్టతను కలిగి ఉన్న ఈ స్నేహ బంధానికి గుర్తుగా జరుపుకునే "స్నేహితుల దినోత్సవం" సందర్భంగా స్నేహితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
By Nanubolu Rajasekhar



Nice article
Very nice article👌
Very nice
Well said about friendship
స్నేహం యొక్క గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పారు