విద్య: మార్కులు కాదు... నైపుణ్య విలువలు
- Hashtag Kalakar
- Aug 13
- 2 min read
By Nanubolu Rajasekhar
“విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం; పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం” అంటే, విద్య వినయాన్ని ఇస్తుంది, వినయంతో వ్యక్తి పాత్రత (యోగ్యత) పొందుతాడు. పాత్రత వలన ధనం వస్తుంది; ధనంతో ధర్మం, ధర్మంతో చివరికి సుఖం లభిస్తుంది. ఇంతటి విశిష్టతను కలిగిన విద్య, భగవంతుడు మనిషికి ప్రసాదించిన గొప్ప జ్ఞాన సంపద. విద్య ఒక దేశ మానవ వనరుల నిర్మాణ సాధనం మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, సమాజ నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా నిలిచే మూల స్తంభం కూడా. విద్య విద్యార్థులను పట్టభద్రులుగా తయారుచేసే ప్రక్రియ మాత్రమే కాదు, శాస్త్ర జ్ఞానంతో పాటు, విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా, నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది పటిష్టమైన దేశ నిర్మాణంలో కీలకపాత్రను పోషించే జ్ఞాన భాండాగారం కూడా. విద్య పాఠ్యపుస్తకాల పఠనంతో ముగిసే అభ్యాసం మాత్రమే కాదు, ఆలోచనా శక్తిని వికసింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదించి, సరైన జీవన మార్గాన్ని ఉపదేశించే గొప్ప మార్గదర్శి కూడా.
భారతదేశానికి విద్యతో ఉన్న అనుబంధం చారిత్రికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా చాలా అపారమైనది. భారతీయ జ్ఞాన సంపద ప్రాచీన కాలంలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో విస్తరించి ఉండేది. అనాదిగా భారతదేశం “జ్ఞానభూమి”, “విద్యాక్షేత్రం”గా ప్రఖ్యాతి గాంచింది. "సర్వేపి విద్యా సర్వత్ర గమ్యం" అనే తత్త్వంతో, విద్యను కేవలం ఉపాధి సాధనంగా కాక, జీవన మౌలికంగా భావించిన దేశం మన భారతదేశం. అయితే, కాలక్రమేణ పాలనా విధానాల మార్పులు, సామాజిక పరిణామాలు, ప్రపంచీకరణ వంటి ప్రభావాలతో భారతీయ విద్యా విధానం ఎన్నో రూపాంతరాలు చెందుతూ వస్తుంది. ఈ వ్యాసంలో, ప్రాచీన భారతీయ విద్యా విధానం నుంచి నేటి ఆధునిక విద్యా వ్యవస్థ వరకు జరిగిన రూపాంతరాలను, వాటి ప్రభావాలను సమగ్రంగా విశ్లేషించుకుందాం.
భారతీయ విద్యా విధానం – చారిత్రక మార్పులు:
ప్రాచీన కాలం:
భారతీయ విద్యా వ్యవస్థకు మూలం గురుకుల విద్యా వ్యవస్థ. ఇందులో విద్యార్థి గురువుతో నివసిస్తూ విజ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం అనే మూడు మూలస్థంభాలపై విద్యను ఆచరణాత్మకంగా అభ్యసించేవాడు. విద్యార్థి విద్యను ఆచరించేదిగా, అనుభూతి చెందేదిగా, వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకునేదిగా, నైపుణ్యాన్ని సంపాదించేదిగా భావించి గురువు దగ్గరే నివసిస్తూ శిష్యరికం చేసేవాడు. ఈ విధానం ద్వారా భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్యశాస్త్రం మరియు వాస్తు శాస్త్రం వంటి విభిన్న శాస్త్రాలపై లోతైన జ్ఞానాన్ని విద్యార్థులు సాధించేవారు. ప్రాచీన భారతదేశంలో తక్షశిల, నలందా, విక్రమశీల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అక్కడ విద్యార్థులకు బౌద్ధ, జైన, హిందూ ధర్మ గ్రంథాల అధ్యయనంతో పాటు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం, సంగీతం, నాట్యం వంటి అనేక శాస్త్రాలను బోధించేవారు. విద్యార్థులు గురువుల వద్ద నివసిస్తూ క్రమశిక్షణ, ధ్యానం, సేవ, సత్యం వంటి విలువలను అలవర్చుకుని విద్యను సమగ్రంగా అభ్యసించేవారు.
మధ్యయుగ కాలం:
ఇస్లామీయ పాలకుల కాలంలో విద్యపై కొంత పరిమితి దృష్టి కోణం ఏర్పడింది. మదర్సాల ద్వారా అరబిక్, ఫార్సీ భాషలు, ఇస్లామీయ ధర్మశాస్త్రాలు బోధించబడే విధంగా విద్య మారింది. ప్రజల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతూ, విద్య సామాన్యులకు అందని ఆస్తిగా మారింది. అయినప్పటికీ, ఖగోళ విజ్ఞానం, వైద్యశాస్త్రం, సాహిత్యం, కళలు, సంగీతం మధ్యయుగాల్లో అభివృద్ధి చెందాయి.
బ్రిటిష్ పాలన:
లార్డ్ మాకలే 1835లో ప్రవేశపెట్టిన విద్యా విధానం భారతీయ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. "మానసికంగా బ్రిటిష్, భౌతికంగా భారతీయులు" అన్న దృష్టితో విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాల కోసం తయారు చేసేలా విద్యా విధానాలను రూపొందించారు. విద్య అనేది ఉద్యోగం కోసం నేర్చుకునే సాధనగా మారింది. ఆధునిక పాఠశాలల ప్రణాళిక, పరీక్షల వ్యవస్థ, పాఠ్యపుస్తక నిబద్ధత, ఇవన్నీ అప్పుడే మొదలయ్యాయి. జ్ఞానాన్ని మార్కుల రూపంలో అంచనా వేసే ధోరణి మొదలైంది. భారతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయ, ధార్మిక పాఠ్యాంశాలు మరుగున పడి, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురుకులాల స్థానాన్ని పాఠశాలలు, కళాశాలలు ఆక్రమించాయి.
స్వాతంత్ర్యం తరువాత:
స్వాతంత్ర్యం అనంతరం, భారతదేశం విద్యను ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో అడుగులు వేసింది. వివిధ విద్యా కమిషన్లు, విధానాల ఆధారంగా విద్యా వ్యవస్థ పునర్నిర్మించబడింది. 1968లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత 1986, 1992, 2020లో జాతీయ విద్యా విధానాలు (NEP) మళ్లీ ప్రవేశ ప్రవేశపెట్టబడ్డాయి. బాలల హక్కులపై దృష్టి పెట్టడం, ప్రాంతీయ భాషల్లో బోధన, విద్యలో సాంకేతికను వినియోగించడం, సాంకేతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి మార్గాలు అందులో ప్రవేశపెట్టబడ్డాయి. ప్రత్యేకంగా, అన్ని విధాల వెనకబడిన పిల్లలకు, ముఖ్యంగా బాలికలకు, గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహంగా పథకాలు రూపొందించబడ్డాయి. కాలానుగుణంగా ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థలు, డిజిటల్ పాఠశాలలు, ఆన్లైన్ విద్యా వేదికలు విస్తరించడం మొదలయ్యాయి.
నేటి విద్యా విధానం – నిగూడా లోపాలు:
నేటి విద్యా విధానం కాలంతో పాటు వేగంగా మార్పు చెందుతున్నా, ఆ మార్పు దిశలో ఎన్నో నిగూడ లోపాలు కనబడుతున్నాయి. విద్యకు మూలమైన జ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసాలకు ప్రాధాన్యత తగ్గి, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలకే ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకూ కొనసాగే ఒకే ఒక్క దినచర్యగా విద్య మారడంతో విద్యార్థులు మానసికంగా, శారీరికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాన్ని 'ఎందుకు నేర్చుకోవాలి?' అన్న జిజ్ఞాస లేకుండా, కేవలం ఉత్తీర్ణత కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా మాత్రమే భావిస్తున్నందువల్ల, సొంతంగా పరిశీలించటం, ఆలోచించటం, ఆచరించటం వంటి సామర్థ్యాలను క్రమంగా కోల్పోతున్నారు. దీని ప్రభావం వారి భవిష్యత్తు విద్యపై, ఉద్యోగ అవకాశాలపై తీవ్రంగా పడుతోంది. విద్యాసంస్థలు "మా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు" అని చెప్పుకుంటున్నా, ఎంత శాతం విద్యార్థులకు ఆ ర్యాంకుల వస్తున్నావో, మిగిలిన శాతం విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందో చెప్పవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని సమగ్రంగా విశ్లేషణ చేస్తే నేటి విద్యా విధానం యొక్క పనితీరు అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.
కీలక విద్యా దశ – ఉన్నత పాఠశాల నుండి ఇంటర్మీడియట్ :
ఉన్నత పాఠశాల నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించే విద్యను విద్యార్థికి కీలకమైన దశగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ దశలో నేర్చుకునే పాఠ్యాంశాల్లోని ప్రాథమిక భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, భాషా వ్యాకరణం, వ్యక్తిత్వ వికాసం విద్యార్థి భవిష్యత్తు విద్యకు అత్యంత మూలాధారమైనవి. కానీ, ప్రాథమిక అంశాలను క్షుణంగా నేర్పకుండానే, కేవలం ఒక విషయాన్ని ఎక్కువ సార్లు గుడ్డిగా విద్యార్థులతో సాధన చేయించడం ద్వారా మార్కులు, ర్యాంకులు సాధించే విధానం ప్రస్తుతం కొనసాగుతుంది. దీని ఫలితంగా ప్రాథమిక అంశాలపై అవగాహన లేని విద్యార్థులు ఉన్నత విద్యలో వెనుకబడిపోతున్నారు. అలాగే, ఈ దశలో భాషా శాస్త్రాలకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వల్ల, భాషా పరీక్షల్లో నూరుశాతం మార్కులు సాధించిన విద్యార్థులు కూడా, వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడడం, వినడం, చదవడం, వ్రాయడం (LSRW) లాంటి నైపుణ్యాలలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు విద్యకు, ఉద్యోగ సాధనకు పెద్ద లోపంగా మారుతుంది. అలాగే, చాలా విద్యాసంస్థల్లో మౌలిక వసతులేని, ఇరుకైన గదుల్లో నడిచే విద్యా వాతావరణం విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకిగా మారుతోంది. ఈ దశలో విద్యార్థుల్లో చురుకుగా ఉండే ఆలోచనా శక్తిని సరైన మార్గంలో అభివృద్ధి పరచగలిగితే వారి సృజనాత్మకతకు అవధులుండవు. అందుకే, ఈ కీలక విద్యా దశలో నేర్పే విద్య కేవలం ఉత్తీర్ణతకు పరిమితం కాకుండా, ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించేదిగా, జీవన నైపుణ్యాలను నేర్పేదిగా, వ్యక్తిత్వాన్ని వికసింప చేసేదిగా ఉండాలి.
విద్య– నిరంతర సాధన:
విద్యను గమ్యంగా కాక, నిరంతర ప్రయాణంగా చూడాలి. ఇది ఒక వయస్సుతో ముగిసే ప్రక్రియ కాదు. పరీక్షలు రాయడం, మార్కులు సాధించడం, డిగ్రీలు పొందడం విద్యలో ఒక భాగం మాత్రమే, ముగింపు కాదు. వాస్తవానికి విద్యాభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అనుభవాల నుంచి నేర్చుకోవడం, కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరచడం, విలువల పట్ల అవగాహన పెంచుకోవడం విద్యాసాధనకు ఉత్తమ మార్గాలు. విద్యాలయంలో చదువు ముగిసినా, అభ్యాసం ఆగకూడదు. ఎందుకంటే, విద్య లక్ష్యాన్ని చేరుకోగానే ఆగిపోయేది కాదు, అది మనిషి చివరి శ్వాస వరకు కొనసాగే నిరంతర సాధన. ఈ సృష్టిలో ఎవ్వరు హరించలేని ఆస్తి విద్య మాత్రమే. ఎన్ని పుస్తకాలు చదివామన్నదికాదు, వాటి ద్వారా ఎంత జ్ఞానసంపదను పొందామన్నదే విద్య యొక్క మౌలిక సూత్రం.
నాణ్యమైన విద్య – ఒక సమగ్ర దృక్కోణం:
విద్యను కేవలం పాఠ్య విజ్ఞాన దృష్టితోనే కాక, శారీరక, మానసిక, సామాజిక, నైతిక కోణాల నుంచి కూడా పరిశీలించడమే సమగ్ర దృక్కోణం. ఇలాంటి సమగ్ర దృక్కోణం కలిగిన విద్యనే నాణ్యమైన విద్య అంటారు. ఇది శాస్త్ర విజ్ఞానంతో పాటు జీవన నైపుణ్య విలువలను కూడా అందిస్తుంది. ప్రతి విద్యార్థి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ, అర్థం చేసుకుంటూ, విద్యాభ్యాసాన్ని జీవన అనుభవంగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను కల్పించి, విద్యార్థుల్లో కలిసి పనిచేసే తత్వం, సహకార భావన, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి వ్యక్తిత్వ నైపుణ్యాలు వికసించేందుకు ఈ నాణ్యమైన విద్య దోహదపడుతుంది.
పరిష్కారాలు – పాఠ్య విజ్ఞానంతో పాటు నైపుణ్య వికాసం:
మార్కులు విద్యార్ధుల సామర్ధ్యాన్ని కొంతవరకు అంచనా వేసే ప్రమాణాలే గానీ, వారి భవిష్యత్తుకు ఉపయోగపడేది మాత్రం విద్యా దశలో అభ్యసించిన జీవన నైపుణ్యాలే. 40 శాతం పాఠ్య విజ్ఞానాన్ని, 60 శాతం జీవన నైపుణ్య వికాసాన్ని నేర్పే విధంగా విద్యా ప్రణాళికలు ఉండాలి. విద్య కేవలం మార్కులు, పట్టాలు, ఉద్యోగాల కోసమే కాకుండా, విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దేదిగా ఉండాలి. కేవలం కొద్ది శాతం మందికి ర్యాంకులను సాధించి పెట్టేదిగా కాకుండా, ప్రతి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దేదిగా విద్యా బోధన ఉండాలి. జీవన నైపుణ్యాలను పాఠ్యాంశాల్లో పొందుపరచడమే కాదు, వాటిని కేవలం పరీక్షల కోసమే బోధించే పద్ధతులు మారాలి. నైపుణ్యం లేని ఉత్తీర్ణత, జ్ఞానం లేని డిగ్రీలు ఉపయోగం లేనివి. కాబట్టి, విద్యార్థులకు ఏది బోధించినా, నేర్పినా వారు మానసికంగా నిమగ్నమయ్యేలా విద్యా విధానాలు ఉండాలి. విద్యార్థి ఆలోచించి, అర్థం చేసుకుంటూ చదివితే తప్ప ఉత్తీర్ణత సాధించలేనట్లు పరీక్షా ప్రణాళికలను రూపొందించగలిగితే, నేటి విద్యా విధానంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ, ఇది యాజమాన్యాలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సహకారంతోనే సాధ్యపడుతుంది. జీవన నైపుణ్యాలతో కూడిన విద్య మాత్రమే విద్యార్థి భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయగలదు. ప్రభుత్వాలు అందుకు అనుగుణమైన విద్యా ప్రణాళికలను రూపొందించడమే కాకుండా, వాటిని వాస్తవిక పరిస్థితులతో అనుసంధానించడంలో సఫలీకృతం కాగలగాలి.
ఈ వ్యాసానికి ముగింపు మాటగా... ఒకప్పుడు జ్ఞాన సంపదను పంచే సరస్వతీ ఆలయాలుగా భావించబడిన విద్యాసంస్థలు, నేడు లాభాపేక్షతో వ్యాపార సంస్థలుగా మారిపోయాయి అనడంలో అసత్యం లేదు. లాభాపేక్ష ఉన్నప్పటికీ, విద్యార్థిని ఒక వినియోగదారుడుగా కాకుండా, ఒకప్పుడు ప్రాచీన విద్యావ్యవస్థలో భావించినట్టుగా "జ్ఞానార్థి"గా భావించే నైతికత విద్యాసంస్థలకు తప్పనిసరిగా ఉండాలి. శాస్త్ర జ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, భాషా ప్రావీణ్యత, ఆచరణాత్మక సామర్థ్యం, సృజనాత్మకత, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలను, పాఠ్యాంశాలను రూపొందించి, వాటిని ఆచరణలోకి తీసుకురావాలి. విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలలో వీటిని పొందుపరచడమే కాదు, విద్యార్థులు వాటిని కేవలం పరీక్షల కోసమేనని భావించకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా బోధనా పద్ధతులలో మార్పులు తీసుకురావాలి. విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ "విద్య కేవలం ఉత్తీర్ణత కోసమే" అన్న దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. ప్రతి విద్యార్థిని ఏదో రీతిలో ఉత్తీర్ణుడిని చేయాలన్న ఆలోచన నుంచి , తన మేధస్సును ఉపయోగించి సాధన చేసిన విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించాలనే ఆలోచనకు అందరూ మారాలి. ఈ మార్పు వలన ప్రతి విద్యార్థి తన సొంత ఆలోచనలను ఉపయోగించి, తన సొంత సామర్థ్యంతో ఉతీర్ణతను సాధిస్తాడు. అలా సాధించిన ఉత్తీర్ణతలో నేటి ప్రపంచానికి కావలసిన నాణ్యమైన విద్య ప్రకాశిస్తూ ఉంటుంది. విద్యార్థి మానసికంగా నిమగ్నం కాకుండా సాధించిన ఉత్తీర్ణతలో “జ్ఞానం” అనే పరిమళం ఎప్పటికీ ఉండదు.
విద్యా దీపాన్ని జ్ఞానంతో ఒక్కసారి వెలిగిస్తే, అది జీవితాంతం వెలుగును ప్రసరిస్తుంది
By Nanubolu Rajasekhar

Comments