మరోలా ఉండేది....
- Hashtag Kalakar
- Dec 3, 2025
- 1 min read
By Dr. Samudrala Priskilla
శకుంతలా?
ఎందుకే అంత వగా!
నీకు జరిగిందే దగా!
అంతా చేసి ఏడిపించాడు
దుష్యంతుడు ..
అంతా రాసి కొడుకుకే పట్టం
కట్టించాడు
నన్నయ ఎంత తెలివి గల వాడు!
అబ్బాయినే పుట్టించాడు
అమ్మాయిని భ్రూణ హత్య చేసాడు
నన్నయ ఎంత హంతకుడు...
ఆడదానివే కదే!
అమ్మాయి పుడుతుందని ఎందుకనుకోలేదే!!
అమ్మాయిని కని
ఎందుకని ఇవ్వవని
రాజ్యమడుగమని
కల కన్నట్టైతే ఎంత బాగుండేదనీ!
నీ కల నిజమైనట్టైతే ఇంకెంత బాగుండేదనీ!!
అప్పుడు తెలుగు చరిత్ర
తెలుగులో సాహిత్య చరిత్ర
తెలుగు సాహిత్యంలో స్త్రీ చరిత్ర
మరోలా ఉండేదే!!
ఒక్క సారి ఆలోచిస్తే ఎంత బాగుండేదే!!
పంచపతుల మధ్య మెలిగిన
పతివ్రత ద్రౌపదీ!
నిండు సభలో తులువలా
నిలబెట్టి నీ వలువ లాగుతుంటే
ఐదుగురిలో ఐదోవాడన్నా
వస్తాడనీ రక్షిస్తాడని
ఎదురు చూసావే!!
తెలుసుకోలేదేమే
మానం నీదే
తలవంచిన నీ పతులది కాదే!
చెంపకేసి చెళ్ళున చరిచి ఉంటే
చీర విడిచి తోక ముడిచి కుక్కలా
తిరిగి వెళ్ళే వాడే!
అప్పుడు
తెలుగు సాహిత్యంలో నీ చరిత
మరోలా ఉండేదే!!
రాజ్యంలో సతులంటే
పతులకు సుంతైనా సాన్త్వనముండేదే!
ఆఖరికి కృష్ణుడిచే
వస్త్ర దానం చేయించాడే
తిక్కనెంత తెలివిగలవాడే!
సీతా! నీది ఆదర్శ రాతా!
మాన పరీక్షకు ఎదురీదావే
ఎందుకు పడ్డావే ఇంత రభస
నీ చెల్లెళ్ళకేదే భరోసా!!
వాల్మీకి ఎంత తెలివి గల వాడు
పవిత్రత పేరుతో
నిన్ను మంటల్లో నెట్టేసాడు..
ప్రతిఘటించి ఉంటే
రామాయణంలో సీతాయణం
అంటే ఎప్పటికీ అందరికీ
తెలిసేదే....
కనీసం ప్రశ్నించలేదేమే రాముని
తన మాన పవిత్రత నిరూపించమనీ...
ఎన్ని ఎదుర్కొన్నా
ఎన్ని ఎదురొచ్చినా
ఎన్ని ఎదురై అడ్డొచ్చినా
ఇప్పుడు మీ చెల్లెళ్ళు
ఆధ్యాపకులూ ఆచార్యులూ
స్పేస్ వాకర్ లూ ఏరో నాటికల్ దళాలూ
ఎక్జామినర్లూ ఎక్జిగ్యూటివ్ ఆఫీసర్ లూ
ఐఏఎస్ లూ ఐపియస్ లూ
ప్రతి రంగంలో ప్రతినిధులూ.
{భారతంలో గాంధర్వ వివాహం పేరుతో శకుంతలకు భంగపాటు జరిగింది. తరువాత పుట్టిన బిడ్డకు రాజ్య వారసత్వం కోసం ఎంతో అవమానం ఎదుర్కొంది. ద్రౌపది మాన రక్షణకై తల్లడిల్లింది. రామాయణంలో సీత మాన పరీక్ష ఎదుర్కొంది. మానం పేరుతో స్త్రీకి పవిత్రత ఆపాదించి గొప్పగా చిత్రించిన తీరుకు ప్రతిఘటన ఉన్న స్త్రీల కోణంలో వారి మనస్సులకు సాక్షిగా ఈ కవిత... ఇది లింగ వివక్షకు నిదర్శనం. తరువాత వచ్చిన రాజ్యాంగంలో మూడవ భాగం, ఆర్టికల్ 15లో వివక్ష నిషేధ చట్టం ఉంది. అందులో లింగవివక్ష కూడా నిషేధం.. అని తెలుసుకోగలరు.}
By Dr. Samudrala Priskilla

Good
Excellent 👌
👍
Nice
Excellent