మట్టి వాసన
By Kruthika Mantha
ధభా ధభా కొట్టుకుంటున్నాయి తూర్పు వైపు కిటికీలు. అలసి పడున్నానేమో అదీ
పనేననిపించింది. లేవలేక "నానీ !!ఆ కిటికీలు కాస్త చూడు నాన్నా" అని బొమ్మలేసుకుంటున్న
మా వాడికి పని చెప్పాను.అలాగే అమ్మా!అన్నవాడు వెళ్ళాడో మానాడో చూసే స్థితిలో లేదు నా నిద్ర.
కాస్త తలెత్తి చూసి హమ్మయ్య వెళ్ళాడు అనుకున్నాను. వెళ్లి ఐదు నిమిషాలు గడిచాయి కిటికీలమోత
ఆగలేదు నాని గాడు రాలేదు. మళ్ళీ ఏం ఘనకార్యం చేసాడో వీడు అనుకుని "నానీ "అనుకుని
గబగబా తూర్పు వైపుకు కదిలాను. అక్కడ వాడు కిటికీ దగ్గర ఒక కుర్చీ మీద కూర్చుని కిటికీ లోంచి
బయటకు చూస్తూ ఉన్నాడు. ఏమైంది నాని ఇక్కడ కూర్చున్నావ్? ఏం చూస్తున్నావ్? అన్నాను.
"అమ్మమ్మ వస్తుందేమో అని చూస్తున్నానమ్మా" అన్నాడు. అదేంటి నాని అమ్మమ్మ ఏం చెప్పలేదు
కదా ! "కాదమ్మా అమ్మమ్మ వస్తుంది ఎందుకంటే అమ్మమ్మ ఇంటి దగ్గర ఇదే వాసన వచ్చేది. నాకు
చాలా ఇష్టం. “వాడి మాటలకు నవ్వి వాన్ని దగ్గరకు తీసుకొని అది మట్టి వాసన అని అలా చెప్తూ
ఉన్నాను ఈ లోపే కళ్ళు నలిపేస్తున్న వాడిని మెల్లగా గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను.
నాకూ చిన్న కునుకు పట్టేసింది. కిటికీల చప్పుడికి మెలకువ వచ్చి వేయడానికి వెళ్లాను.
ఆ మట్టి వాసన నన్ను మా ఊరికి లాక్కెలిపోయింది. మాఇళ్ళు ,చుట్టూ చెట్లూ వీటన్నిటి కన్నా
వర్షం వస్తే చాలా చక్కగా కనిపించే నా గదిలోని కిటికీ అన్నీ గుర్తొచ్చేసాయి.అలా నా ఊహలు
ఒక సంఘటన పైకి మళ్ళాయి….
బహుశా నేను చదువుకుంటున్న రోజుల్లోననుకుంటా సెలవలకై ఊరెళ్ళినపుడు ఒక రాత్రి
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.ఆ వర్షాన్ని కిటికీ లోంచి చూస్తున్న నేను
పక్కనున్న డైరీ తీసుకుని కవిత రాసుకున్నాను. ఆ సంఘటన గుర్తు రాగానే గదిలోకి వెళ్ళి
అల్మారా లో పై అర లో డైరీకై వెతకగా కనిపించింది.అందులో ఆ వర్షం కవిత కనిపించి నన్ను
కనువిందు చేసింది-
“వానజల్లు”-
వాన అందమే,వాన జల్లు అందమే,వాన వెలిసాక నేలా అందమే!!
నల్లగేటున నీటి చుక్కలు
వీధి దీపపు కాంతుల్లో
మినుగురులై మెరిసాయి
మండుటెండను తాలిన నేలను
తొలిచినుకులు తాకిన వేళ
సెగలు ఎగిసిపడ్డాయి
తొలిజల్లుకు చల్లబడి
మరుజల్లుకు కుదుటపడి
నేలమీద నీటిని
చినుకులు తాకిన వేళ
నక్షత్రాల్లా ఆనుతున్నాయి….
ఇలా కవిత ను చదివి అప్రయత్నంగా నే అన్నీ చదివేసాను. సుమారు యాభై దాకా రాసాను.
అప్పట్లో చాలా ఇష్టం ఉండేది రాయడమంటే! జాబ్ వల్ల ఈ మహానగరం వచ్చాక అన్నీ పొడవైన
బిల్డింగులే కానీ చెట్లే లేవు.దాంతో రాయడం మీద యావ తగ్గిపోయింది. కొత్తగా వచ్చిన ఈ ఇళ్ళు
మళ్ళీ పాత జ్ఞాపకాలను వెలికితీసింది.
ఈ పదేళ్ళలో వృత్తి పరంగా ఎదిగాను కానీ వ్యక్తి గీతంగా అక్కడే ఆగిపోయిన నా జీవితాన్ని మా
ఎనిమిదేళ్ళ నానిగాడి అమ్మమ్మ ప్రేమ ముందుకునడిపించింది. పక్కనున్న డైరీ తీసుకుని
ఈకధనేకొత్తకధగామొదలుపెట్టాను…..
By Kruthika Mantha

Comments