మ్యాథ్స్ ఫోబియా – లక్షణాలు, కారణాలు, నివారణలు
- Hashtag Kalakar
- Aug 13
- 3 min read
By Nanubolu Rajasekhar
గణితం…గణితం...ఈ పదం కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి కొంతమందికి భయాన్ని(ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు , ఒక ఊహాజనితమైనది. కొంతమంది మనుషుల్లో ఉండే అనేకరకాల భయాల మాదిరిగానే కొంతమంది విద్యార్థుల్లో గణిత భయం (మ్యాథ్స్ ఫోబియా) ఉంటుంది. ఈ మ్యాథ్స్ ఫోబియా వలన, గణితం అంటే చాలా కష్టం, అది మనకు ఎప్పటికీ రాదు అనే అపోహ కొంతమంది విద్యార్థుల మనసుల్లో గూడు కట్టుకుని ఉంటుంది. ఈ అపోహ వలన మ్యాథమెటిక్స్ కోర్సులలోనే కాకుండా, మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ తో సంబంధం ఉన్న ఇతర కోర్సులలో, పోటీ పరీక్షలలో కూడా విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఈ వెనుకబాటు తనం విద్యార్థుల మంచి భవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మ్యాథ్స్ ఫోబియా విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు వారి ఉద్యోగావకాశాలకు ఆటంకంగా మారుతుంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం, గణిత సమస్యలను పరిష్కరించగల ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థులు, మ్యాథ్స్ ఫోబియా ఉన్న విద్యార్థుల కంటే ఎక్కువ తార్కిక నైపుణ్యాలను మరియు సృజనాత్మకతను కలిగి ఉంటారని నిరూపించింది. అసలు, ఈ మాథ్స్ ఫోబియా అంటే ఏమిటి మరియు దానిని అధిగమించే మార్గాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాథ్స్ ఫోబియా (గణితం భయం) – లక్షణాలు:
గణిత సమస్యలను సాధిస్తున్నప్పుడు మీకు చెమట పట్టుతుందా?... అయితే, మీకే కాదు "మ్యాథ్ ఫోబియా" తో బాధపడే చాలా మందిలో ఈ లక్షణం సర్వ సాధారణం. కొన్ని సర్వేలు ప్రకారం 7 నుండి 10 తరగతులలో 82% మంది విద్యార్థులు మ్యాథ్ ఫోబియాతో భయపడుతున్నారని వెల్లడయింది. ప్రతి 10 మంది విద్యార్థులలో ఒకరు మాత్రమే వారి గణిత సామర్థ్యం పై నమ్మకాన్ని కలిగి ఉన్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఈ మ్యాథ్ ఫోబియా సరైన సాధన లేకపోవడం వల్ల విద్యార్థులలో విస్తృతంగా వ్యాపిస్తుంది. మ్యాథ్స్ ఫోబియా అనేది గణిత శాస్త్రాం పేరు వింటేనే విద్యార్థుల్లో తెలియకుండానే కలిగే ఒక భయం లేదా ఆందోళన. మ్యాథ్స్ ఫోబియా తో ఆందోళనకు గురౌతున్న విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చెయ్యలేక గణిత సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. మ్యాథ్స్ ఫోబియా ఉన్న విద్యార్థులు విషయాలను అవగాహన చేసుకుని సమస్యలను సాధించడం కంటే, సమస్యలకు సంబంధించిన సమాధానాలను కంఠస్త పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.మ్యాథ్స్ ఫోబియాతో బాధపడే విద్యార్థులకు,గణిత సంబంధిత సబ్జెక్టులు పెద్ద భూతం లాగా కనిపిస్తాయి. అంతేకాదు, గణిత శాస్త్రంలోని అంశాలను అర్థం చేసుకుని, సంబంధిత సమస్యలను సాధించే ప్రయత్నం చేయకుండానే, ఆ అంశాలు తమకు అర్థం కానివని, ఆ సమస్యలను తాము సాధించలేమనే అపోహలతో విద్యార్థులు సతమతమవుతుంటారు. అందువల్ల, గణిత శాస్త్రం పట్ల ఆసక్తి తగ్గి, దానిని నేర్చుకునే సమయంలో విద్యార్థులు నిద్రపోతూ ఉంటారు. గణితం పట్ల సరైన అవగాహన, సంసిద్ధత, మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన చాలామంది విద్యార్థులు గణితంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇలా విఫలమవుతున్న విద్యార్థులు, తమకు గణిత శాస్త్రం చదివే సామర్థ్యం లేదనుకుని గణిత శాస్త్రం పట్ల పెద్ద భయాన్ని సృష్టించుకుంటారు. దీనినే మనం "గణిత భయం(మ్యాథ్ ఫోబియా)"అని అంటాము.
మ్యాథ్స్ ఫోబియా కారణాలు:
ప్రాథమిక విద్య నుండే "మ్యాథ్స్ ఫోబియా" విద్యార్థుల మనసుల్లో ప్రవేశించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటంటే,1. ప్రాథమిక విద్యలోనే బీజం: ప్రాథమిక విద్యలోనే గణిత శాస్త్రాన్ని చదవడానికి సరైన బోధన, అవసరమైన ప్రోత్సాహం లభించక, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వలన చిన్న వయసులోనే చాలామంది విద్యార్థుల మనసుల్లో కి మ్యాథ్స్ ఫోబియా ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించిన ఈ ఫోబియా పెరిగి పెద్దదై విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి లేకుండా చేస్తుంది.2. గణిత శాస్త్రం కఠినమైనదనే భావన: తల్లిదండ్రులు మరియు చుట్టూ ఉన్నవారు తరచుగా గణితం చాలా కష్టమైనదని చర్చించుకోవడంతో,చాలామంది విద్యార్థులు చిన్న వయసులోనే, గణితం అర్థం కాని సబ్జెక్ట్ అని,అది చాలా కష్టమైనదని,మరియు మనం చదవలేమనే భావనకు లోనౌతున్నారు.ఈ భావనే విద్యార్థులకు చిన్న వయసులోనే గణితం పట్ల భయాన్ని కలిగిస్తుంది. 3. బోధనా పద్ధతుల్లోని లోపాలు: కొందరు ఉపాధ్యాయులు ఉపయోగించే బోధనా పద్ధతులు సరైనవిగా లేనప్పుడు, విద్యార్థులు విషయాలను సులభంగా గ్రహించలేక ఆందోళనకు గురవుతుంటారు. అలాగే, ఉపాధ్యాయులు గణిత శాస్త్రం గురించి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించలేకపోవడం కూడా మాథ్స్ ఫోబియా కి దారితీస్తుంది. 4. భయపెట్టే గణిత ఖచ్చితత్వం( Accuracy): గణితం అనేది సంఖ్యల ఆట, దీనిలో విద్యార్థులు సమస్యలకు ఖచ్చితమైన సమాధానాలను రాబట్టవలసి ఉంటుంది. సరైన సాధన చెయ్యకపోవడం వల్ల, గణిత సమస్యలను సాధిస్తున్నప్పుడు ఖచ్చితమైన సమాధానాలను రాబట్టలేక విద్యార్థులు గణితం అంటే భయపడుతున్నారు.5. ఏకాగ్రతతో కూడిన సాధన లేకపోవడం: గణితానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను (Basics) అర్థం చేసుకోని, క్రమం తప్పకుండా ఏకాగ్రతతో గణితాన్ని సాధన చెయ్యకపోవడం వల్ల కూడా విద్యార్థుల్లో మ్యాథ్స్ ఫోబియా ఏర్పడుతుంది.
మ్యాథ్స్ ఫోబియాని ఎలా అధిగమించాలి?
అనుసరించడానికి సులభతరమైన ఈ తొమ్మిది నివారణలతో మ్యాథ్స్ ఫోబియాను అధిగమించవచ్చు.
1.విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి: 'నేను చేయలేను,' 'గణితం నా సబ్జెక్ట్ కాదు,' మరియు 'గణితం చేయడం చాలా కష్టం' అనే ఆలోచనలు విద్యార్థులకు గణితం పట్ల భయాన్ని పెంచి ఆసక్తిని తగ్గిస్తాయి. అందువల్ల గణితాన్ని బోధించడానికి ముందే ఇలాంటి ఆలోచనలను విద్యార్థుల మనసుల్లో నుంచి ఉపాధ్యాయులు చెరిపివేయాలి. అలాగే, ఉపాధ్యాయులు విద్యార్థులకు 'వారు తమ మనసులో నేను చేయగలను అని అనుకుంటే ఏదైనా చేయగలరని,' 'గణితం సులభంగా, సరదాగా ఉంటుందని,' మరియు 'సరైన విధానంతో ఎలాంటి గణిత సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చని' చెప్పి వారికి గణితం పట్ల ఆసక్తిని కలిగించాలి. విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంచడంకోసం ప్రారంభంలో సులభతరంగా పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలను విద్యార్థుల చేత సాధన చేయించాలి.
2.విద్యార్థులు మ్యాథ్స్ ఫోబియా గురించి స్వేచ్ఛగా మాట్లాడాలి: విద్యార్థులు తమ గణిత భయం గురించి స్వేచ్ఛగా మాట్లాడేలా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. గణితశాస్త్ర పై విద్యార్థులకు ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి. విద్యార్థులు ఎందుకు గణితం గురించి భయపడుతున్నారో, ఏ సమస్యలను సాధించడానికి కష్టపడుతున్నారో విపులంగా అడిగి తెలుసుకుని తగిన సూచనలను విద్యార్థులకు ఇవ్వడం వలన వారిలో గణితం పట్ల ఆసక్తి కలుగుతుంది.
3. శ్వాస వ్యాయామాలు: గణిత ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు, శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సును స్థిరీకరించ వచ్చును. విద్యార్థులు లోతైన శ్వాసను తీసుకొని, శ్వాస పై దృష్టి కేంద్రీకరించి, కొద్దిసేపు ధ్యానంలో ఉండటం వలన వారి మనసు కుదుటపడుతుంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులను వారి మనసులో 'గణితాన్ని నేర్చుకోవడంలో నాకు సౌకర్యం ఉంది,' 'నేను గణితంలో విఫలం కాను,' 'నేను సమర్థుడైన గణిత అభ్యాసకుడిని,' మరియు 'గణితం నా భవిష్యత్తుకు సహాయపడుతుంది' అని సంకల్పం చేసుకోమని సూచించాలి. ఈ శ్వాస ప్రక్రియ సాధన వల్ల విద్యార్థుల్లో గణితం పట్ల ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతూ... మ్యాథ్స్ ఫోబియా తగ్గుతుంది.
4. సాధనే కీలకం: గణితంలో ఎంత ఎక్కువ సాధన చేస్తే, అంత మెరుగైన ప్రావీణ్యతను పొందగలరు. గణితం పై పట్టు సాధించడానికి సాధన ఒక్కటే ఉత్తమమైన మార్గం. సాధనతోనే గణిత భయాన్ని జయించవచ్చు. గణితానికి సంబంధించిన ప్రాథమిక భావనలను (బేసిక్ కాన్సెప్ట్స్) పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, విద్యార్థులు గణిత సమస్యలను సొంతంగా సాధన చేయాలి. సాధన చేస్తున్నప్పుడు విద్యార్థులకు కలిగే అనుమానాలను ఉపాధ్యాయులు వెంటనే నివృత్తి చెయ్యాలి. ఈ విధంగా ప్రాథమిక భావనలను అర్థం చేసుకుని సమస్యలను సాధించడం వల్ల విద్యార్థులకు గణిత సమస్యలను సాధించడం సులభతరమవుతుంది. తద్వారా వారికి గణితంపై పట్టు వస్తుంది. కంఠస్థ పద్ధతి ద్వారా గణిత సమస్యలను, వాటికి సంబంధించిన సమాధానాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకూడదు.ఇది గణిత శాస్త్రం నేర్చుకునే పద్ధతి కాదు.
5. గణితం తేలికగా, సరదాగా ఉంటుందనే భావన కల్పించాలి: నిజానికి, గణిత సమస్యలు కొంత సంక్లిష్టంగనే ఉంటాయి. గణితంలో ఉండే ఈ సంక్లిష్టతే మనిషి మేధస్సుకు విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది. అదే సంక్లిష్టత విద్యార్థులను భయపెడుతుంది. ఉపాధ్యాయులు గణితంలోని సంక్లిష్టతను తమ బోధనా విధానం ద్వారా సులభతరం చేసి, దశలవారీగా నేర్పినప్పుడు, విద్యార్థులు గణిత భావనలను బాగా అర్థం చేసుకుని గణితం పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తారు. అలాగే, గణితానికి సంబంధించిన చిన్నచిన్న సరదా గేమ్స్ ని మరియు పజిల్స్ ని విద్యార్థులతో చేయించడం వలన వారికి గణితం పట్ల భయం పోయి ఆసక్తి కలుగుతుంది.
6. నిజజీవితంలో గణిత యొక్క ప్రాముఖ్యతను వివరించాలి: గణితాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడం వల్ల నిజజీవితంలో కలిగే ఉపయోగాలను, ప్రాథమిక దశలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు విపులంగా వివరించడం వల్ల వారికి గణితం యొక్క ఆవశ్యకత తెలిసి, భయం పోయి, గణితం పై ఆసక్తి కలుగుతుంది.
7. తోటి విద్యార్థులతో అభ్యాసనను ప్రోత్సహించాలి: విద్యార్థులు తరగతిలో బహిరంగంగా వారి సందేహాలను అడగటానికి వెనుకాడవచ్చు. కానీ, వారి తోటి విద్యార్థులతో చర్చించడానికి సిగ్గుపడరు. కాబట్టి ఉపాధ్యాయులు సహా విద్యార్థులతో కలిసి చదువుకునే విధానాన్ని విద్యార్థుల్లో ప్రోత్సహించాలి. విద్యార్థుల పరస్పర చర్చల్లో వ్యక్తమైన సందేహాలను ఉపాధ్యాయులు నివృతి చేయాలి.
8. సృజనాత్మకతతో గణితాన్ని నేర్పాలి: ఉపాధ్యాయులు కొన్ని సృజనాత్మక కార్యకలాపాల ద్వారా గణితానికి సంబంధించిన అంశాలను వివరిస్తే, విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకుంటారు.. దీనికోసం, గణితానికి సంబంధించిన అంశాలలో చిన్నచిన్న ప్రాజెక్ట్స్ ను , పోస్టర్స్ ను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ను, మరియు ఇతర సృజనాత్మక కార్యకలాపాలను తయారు చేయమని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించాలి. ఇలాంటి సృజనాత్మక కార్యకలాపాలు విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని కలిగిస్తాయి.
9.గణితాన్ని నేర్చుకునే దశలో కంప్యూటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించరాదు: ఈ సాంకేతిక యుగంలో గణితానికి సంబంధించిన అనేక కంప్యూటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, విద్యార్థులు గణితాన్ని నేర్చుకుంటున్న దశలో ఈ సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి గణిత సమస్యలను సాధిస్తే, వారు గణితంలో ప్రాథమిక అంశాలపై పట్టును కోల్పోవడంతో పాటుగా, విశ్లేషణాత్మక మరియు తార్కిక నైపుణ్యాలను, సృజనాత్మకతను కోల్పోతారు. కాబట్టి,విద్యార్థులు గణిత శాస్త్రలో పూర్తి ప్రావణ్యత సంపాదించి, పరిశోధన స్థాయికి వచ్చిన తర్వాతే ఈ గణిత సాఫ్ట్వేర్లను ఉపయోగించడం ఉత్తమం.
ముగింపు సారాంశంగా, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి అవకాశాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సాంకేతిక పురోగతి, శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సృజనాత్మకత, రోజువారీ కొలతలు ,ఇంజనీరింగ్, వైద్య మరియు ఆరోగ్య శాస్త్రాలు, పర్యావరణ అధ్యయనాలు మరియు పరిరక్షణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యం, అంతరిక్ష అన్వేషణ మరియు నావిగేషన్, క్రీడా విశ్లేషణ మొదలగు రంగాలలో గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక అనువర్తనాలు(Applications) ఉన్నాయి. గణితాన్ని ఉపయోగించని వృత్తి, విభాగం ప్రపంచంలో ఏదీ లేదు.అందుకే, గణితాన్ని "క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్" మరియు "ది లాంగ్వేజ్ ఆఫ్ ది యూనివర్స్" అని అంటారు. ఇంతటి ప్రాముఖ్యతను కలిగిన గణితాన్ని ప్రేమిస్తూ… శోధిస్తూ...సాధించాలి.
*** సాధన చేస్తే...గణితమే విద్యార్థికి ఉత్తమ నేస్తం ***
By Nanubolu Rajasekhar
Comentarios