మాతృభాషలో పొరపాట్లు… ఆంగ్ల భాషతో అగచాట్లు
- Hashtag Kalakar
- Aug 13
- 2 min read
By Nanubolu Rajasekhar
మానవుడు అనాగరిక దశ నుంచి నాగరికుడిగా రూపాంతరం చెందడంలో మానవుడు సృష్టించిన భాష కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. మానవులు తమ ఆలోచనలను, భావవేశాలను సంజ్ఞలు ద్వారా వ్యక్తీకరించే దశ నుంచి ఒక భాష ద్వారా వ్యక్తపరచుకునే పరిపక్వతను సాధించిన తరువాత, మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడి వారి అభివృద్ధి మొదలైంది.
భాష మానవజాతి యొక్క గొప్ప ఆవిష్కరణ. ప్రపంచంలోని ప్రతి మనిషి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయడానికి మరియు ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే మాధ్యమమే ఈ నుడి అంటే భాషే. భాషకు లిపి, భాషాసూత్రలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు. ప్రపంచంలోని మానవ భాషల సంఖ్య సుమారు 7000 వరకు ఉండవచ్చని ఒక అంచనా. మన భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తి కాదు.
భాష ఒక దివ్య సృష్టి:
మనిషి మనసులోని భావాలను ఎదుటివారికి అర్ధం అయ్యేటట్టుగా మాటల రూపంలో చెప్పడానికి అలాగే ఎదుటివారి భావాలను మాటల రూపంలో విని అర్థం చేసుకోవడానికి భాష ఉపయోగపడుతుంది. ఒక విషయం మాట్లాడడానికి, చదవడానికి, వ్రాయడానికి మరియు వినడానికి భాష అనేది చాలా ప్రధానం. భాష తెలిసి ఉండడం వలన ఒక విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేయవచ్చును.సైగల ద్వారా మనిషి మనసులోని భావాలను వ్యక్తం చేయడం కూడా ఒక భాషే.యావత్తు ప్రపంచ మానవాళిని అనుసంధానం చేయగల దివ్యమైన సృష్టి ఈ భాష.
ఉగ్గుపాల మాతృభాష - భాషకు పునాది:
పుట్టిన బిడ్డ అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో పాటు అమ్మ నేర్పే భాషను నేర్చుకుంటుంది. ఉగ్గుపాలతో అమ్మ నేర్పిన భాషనే మాతృభాష అంటారు.అలాగే, ఆ బిడ్డ ఎదిగే కొద్ది తన చుట్టూ ఉన్న ప్రపంచంతో తన ఆలోచనలను అనుసంధానం చేసుకొని అభివృద్ధిని సాధించడానికి అవసరమైన అన్ని ప్రామాణిక భాషలను నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఒక వ్యక్తి ఏ భాషనైనా నేర్చుకోవడానికి పునాది మాతృభాషే. అలాంటి మాతృభాషను నేర్చుకునే దశలో పొరపాట్లు జరిగితే ఆ వ్యక్తి మరే ఇతర భాషలోనూ పరిపూర్ణత సాధించలేడనేది అక్షర సత్యం. అందుకే ప్రాథమిక విద్య నుండే తప్పనిసరిగా అమ్మ నేర్పిన కమ్మని మాతృభాషలో విద్యార్థులకు గట్టి పునాది వెయ్యాలి.
భాష - నాలుగు నైపుణ్యాలు:
మనిషి లోని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేది భాషే.ఒక భాషను నేర్చుకుని దానిపై పట్టు సాధించడం అంటే ఆ భాషను ఏకాగ్రతతో విని(Listening,L) అర్థం చేసుకోగలగడం, వ్యాకరణ మరియు ఉచ్చరణ దోషరహితంగా మాట్లాడగలగడం (Speaking,S), చదవగలగడం (Reading,R) మరియు వ్రాయగలగడం(Writing,W).ఈ నాలుగు LSRW నైపుణ్యాలను అలవాటుగా మార్చుకున్న విద్యార్థి ఏ భాషలో నైనా పట్టు సాధించగలడు. అయితే, నేటి యువతకు ఈ నాలుగు నైపుణ్యాలపై తగినంత తర్ఫీదు అవగాహన లేకపోవడం వల్ల వారు భాషపై పట్టును కోల్పోతున్నారు. భాష పై పట్టు సాధించని వ్యక్తి తనలోని సృజనాత్మక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసుకోలేడు. నిరంతర సాధన ద్వారానే భాషపై పట్టు సాధ్యమవుతుంది.
ప్రపంచీకరణ భాష:
ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో అర్హతలు ఉన్న వారెవరైనా ప్రపంచంలో ఎక్కడికెళైనా ఉద్యోగాన్ని సంపాదించి హాయిగా జీవించవచ్చు. అయితే నేటి ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో సుమారు 60కి పైగా దేశాల్లో 135 కోట్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్న “యూనివర్శల్ లాంగ్వేజ్”ఆంగ్ల భాషను ముందుగానే నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది.ఈ కారణం చేతే విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ, మాతృభాషను మొక్కుబడిగా చదువుతున్నారు. కానీ ప్రాథమిక విద్య నుండి డిగ్రీ విద్య వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా, విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించకపోగా మాతృభాషపై కూడా పట్టును కోల్పోతున్నారు.
భాషతో అగచాట్లు-కారణాలు:
ఆంగ్లభాష పై పట్టు సాధించలేక పోవడానికీ మరియు మాతృభాషపై పట్టు కోల్పోవడానికీ అనేక కారణాలున్నాయి. విద్యార్థులు ఈ భాషలకు సంబంధించిన కోర్సులను నేర్చుకునే సమయంలో వాటిని కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం చదివే కోర్సులుగానే పరిగణించడం ఒక ముఖ్య కారణం. మరో బలమైన కారణం ఏమిటంటే, విద్యార్థులు ప్రాథమిక విద్య నుండి మాతృభాషలో గానీ మరే ఇతర భాషలో గానీ వినడం, మాట్లాడడం, చదవడం మరియు వ్రాయడం వంటి మంచి భాషా సంస్కృతి(కల్చర్ అఫ్ లాంగ్వేజ్) అలవర్చుకోకపోవడం. అలాగే, మనిషి అభివృద్ధికీ భాషకూ మధ్య ఉన్న సహసంబంధాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలాగా వివరించ లేకపోవడం వేరొక కారణం.
అంతేకాదు,నేటి యువత మాతృభాషైన తెలుగులో మాట్లాడిన పదాలను తెలుగు అక్షరాల రూపంలో వ్రాయలేకపోతున్నారు. అలాగే, ఆంగ్ల భాషలో ఉచ్చరణ, వ్యాకరణ దోషాలు లేకుండా ధారాళంగా మాట్లాడలేకపోతున్నారు. నేటి యువత వాట్సప్ మెసేజ్ కల్చర్ ని చూస్తే, వారు తెలుగులో అనుకున్న భావాన్ని ఇంగ్లీష్ అక్షరాల రూపంలో వ్రాయడానికి అలవాటు పడుతున్నారు. అంటే తెలుగు, ఇంగ్లీష్ రెండూ మిక్స్ చేసిన ఒక లాంగ్వేజ్ ని వారు ఉపయోగిస్తున్నారు. ఈ మిక్స్డ్ లాంగ్వేజ్నే మనం సరదాగా “తెంగ్లీష్” అని అనవచ్చు. అందుకే ,నేటి యువత ఆంగ్ల భాషతో పాటుగా మాతృభాష పై కూడా పట్టును కోల్పోతున్నారు. యువత ఈ “తెంగ్లీష్” కల్చర్ నుండి వెంటనే బయట పడాలి లేకపోతే వారికి మాతృభాషలో పొరపాట్లు, ఆంగ్లభాషతో అగచాట్లు తప్పవు.
.ఆంగ్ల భాష - విద్యాసంస్థల పాత్ర:
మన మాతృభాష కాని ఆంగ్ల భాషను విద్యార్థులు సమర్థవంతంగా నేర్చుకోవాలంటే అందుకు అవసరమైన వాతావరణాన్ని విద్యాసంస్థలు సృష్టించగలగాలి. విద్యాసంస్థలు విద్యార్థులందరూ మంచి ఆంగ్ల భాషలో పరస్పరం సంభాషించుకునే అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆంగ్ల భాషలో వినండి,మాట్లాడం, చదడం మరియు వ్రాయడం పై చక్కటి తర్ఫీదిస్తూ విద్యార్థుల మధ్య ఒక మంచి భాషా సంస్కృతి ( ఏ కల్చర్ అఫ్ లాంగ్వేజ్ ) నెలకొల్పాలి. విద్యార్థులు మంచి వక్తలు మాట్లాడే స్ఫూర్తిదాయకమైన వీడియోలను వీక్షిస్తూ వారు ఉపయోగించే ఇంగ్లీషు భాషను వినే అవకాశాలను విద్యాసంస్థలు కల్పించాలి.తరచుగా ఆంగ్ల భాష లో వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తూ ఉండాలి. విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఆసక్తి కలగడానికి ఆ భాష ఔన్నత్యాన్ని తెలియపరిచే "లాంగ్వేజ్ వర్క్ షాప్స్ "ని క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో నిర్వహించాలి.
అంతేకాకుండా, విద్యార్థుల చుట్టూ ఉన్న వాతావరణం వారి భాషపై ప్రభావం చూపుతుంది. అందుకే,అసభ్య పదజాలంతో విద్యార్థులు పరస్పరం సంభాషించుకునే అసభ్యకరమైన వాతావరణాన్ని విద్యాసంస్థల్లో ప్రోత్సహించకూడదు. ఇటువంటి వాతావరణం విద్యార్థుల పై మరియు వారి భాషపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఇలాంటి చెడు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి వెయ్యాలి.ఈ విధమైన జాగ్రత్తలను తీసుకుంటూ విద్యార్థులు చక్కటి ఆంగ్ల భాషను అభ్యసించడానికి అనువైన వాతావరణాన్ని మరియు అవకాశాల్ని విద్యాసంస్థలు ఆచరణలో కొంచెం క్లిష్టమైనా తప్పనిసరిగా కల్పించాలి.
భాష - సాంకేతిక ప్రభావం:
నేడు ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ లో విప్లవాత్మకత వలన వస్తున్న లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ కూడా మనిషి భాష పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మనిషి సాంకేతికత పేరుతో పూర్తిగా ఈ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ పై ఆధారపడితే కొంతకాలానికి మనిషి మళ్లీ మాటలు రాని, రాతలు రాని పాత రాతియుగం లోకి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకే, విద్యార్థులు స్వయంగా వినడం, మాట్లాడడం,చదవడం మరియు వ్రాయడం పై పూర్తిగా పట్టు సాధించిన తర్వాతే మాత్రమే ఈ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ సహకారాన్ని తీసుకోవడం ఉత్తమం.మనిషి మేధస్సులోంచి వస్తున్న ఆలోచనలకు సహకారిగా మాత్రమే ఈ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించుకోవాలి లేనిచో మనిషి మేధస్సులోని సృజనాత్మకత అంతరించిపోతుంది.
చదువు – మాధ్యమం:
ఈ కథనానికి ముగింపుగా, ప్రాథమిక విద్య నుండి మాతృభాష మాధ్యమంలో చదవాలా లేదా ఆంగ్ల మాధ్యమంలో చదవాలా అనే మీమాంశ అవసరం లేదు. మన ప్రవృత్తికి మాతృభాష ఎంత అవసరమో మన వృత్తికి నేడు ఆంగ్ల భాష కూడా అంతే అవసరం. అందుకే, మాతృభాషను పునాదిగా చేసుకుని ఆంగ్లభాషను మరియు అవసరమైన ఇతర ప్రామాణిక భాషలను నేర్చుకోవాలి.
భాష ఒక పాఠ్య పుస్తకం కాదు…
మనిషి అంతరంగానికి ప్రతిరూపం
ప్రపంచాన్ని అనుసంధానించే దివ్య సృష్టి
By Nanubolu Rajasekhar

Comments