పల్లె వెలుగు కథలు
By Kruthika Mantha
చలికి ఎండకి మధ్యనున్న వాతావరణంలో రావులపాలెం బస్టాండులో రాజోలు బస్సుకై నిల్చుని ఉండగా “రాతిరి ఆ పడమట సంధ్యారాగం అంత సేపు చదవడం అవసరమంటానే నీకు” అనుకుంటూ ఈ రద్దీలోఇంకెంత సేపు వెయిట్ చేయాలా అని ఆలోచిస్తూ అలాగే నిలుచుండి పోయాను. పదకొండా పన్నెండా సుమారు రెండయినట్టుంది చదివి పడుకునేసరికి. ఇంక అంతే సంగతి లేచేసరికి తొమ్మిది. కాకినాడ నుంచిబస్సు పట్టుకుని రావులపాలెం వచ్చే సరికి పన్నెండు.
నడినెత్తి మీద సూర్యుడున్నా కార్తీక మాసం వల్లనేమో చలి మాత్రం తగ్గలేదు పైగా తుఫానొకటి ఈ చలి సరిపోదన్నట్టు….. ఈ ఆలోచనలమధ్య రాజోలు బస్సు గట్టిగా మోత మోగించుకుంటూ వచ్చింది ఇప్పుడు కాకపోతే ఇంకో గంటాగాలి రండి రండి అన్నట్టు. ఎప్పుడూ ఉండేటంత తండోపతండాలుగా లేరు జనాలు అదృష్టమేమో నా బ్యాగు, ట్రాలీ ని పట్టుకుని బస్సు ఎక్కి డోరు ముందు సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని ఉన్న ముసలావిడ పక్కన కూర్చని ,నా పక్కన ఖాళీ ఉంటే అక్కడ ట్రాలీ ని పెట్టాను.
ఆవిడకి సుమారు డెబ్భైఏళ్లుంటాయి. నేనొచ్చి కూర్చొన్నది కూడా గమనించనంత నిద్ర లో ఉంది. కిటికీని ఆనుకుని నిద్రపోతున్న ఆమె తల రోడ్లగుంతలకు కాస్త కాస్త జరుగుతూ నా భుజం మీదకు వాలింది. సర్లే పడుకుంది లే అని నేనూ పట్టించుకోలేదు. ఇంతలో పెద్ద గుంతొకటి రావడంతో గభాలున లేచి కళ్ళు తెరిచింది. చుట్టూ చూసుకుని తాను దిగే చోటు ఇంకా రాలేదని మళ్ళీ పడుకుంది. మళ్ళీ అంతే నా భుజాన వాలిపోయింది నిన్ను నేనెక్కడ పడుకోనిస్తానే అన్నట్టు మా రోడ్ల గుంతలు మళ్ళీ వచ్చాయి. అంతే ఇంక ఇది పని కాదనుకుందేమో కాళ్లు పెట్టుకునే చోట ఉన్న తన పెద్ద సీవెండి గిన్నెలో నుంచి ఒక సంచి తీసి అందులోని రెండు చెకోడీలు తీసుకుని ముక్కలు చేసుకుని తినడం మొదలెట్టింది తింటోంది కానీ ఆమెకు పళ్ళున్నాయా అని నా అనుమానం.
సర్లే అని నవ్వుకుంటూ తల తిప్పి చూస్తుంటే మొదటి సీట్లో ఇద్దరు ఆడవాళ్ళు, సుమారు నలభై నలభై-అయిదేళ్లు ఉంటాయి. ఏదో విషయంపై తెగ మాట్లాడుకుంటున్నారు. వద్దనుకున్నా వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు. ఒకావిడ కొడుకు అమెరికా లో ఉంటాడట వాడి గురించిత గొప్పలు పోతోంది. అదీ ఇదీ అలాగా ఇలాగా అని. ఆ ఇంకొకావిడేమో అవునా అని వచ్చిన ఆశ్చర్యాన్ని ఆపుకుంటూ మావాడూ మ్యానేజరు పక్కనే పీచు ఫ్యాక్టరీ లో. నెలొచ్చేసరికి బానే వస్తాయి. నాకూ మా ఇంటాయనకే కదా ఎక్కానా తొక్కానా అయిపోతుంది అని తన కొడుకూ ఏం తక్కువ కాదు అన్నట్టు చెబుతోంది. సర్లేండి అనుకుని మొదటావిడ మూతిముడుచుకుంది.
వీళ్ళ గోల చూసి నవ్వొచ్చినా ఇంతే కదా లోకం అని అనిపించింది. ఈలోపు బస్సు మళ్ళీ ఆగింది. ఒక కుర్ర కారు గుంపు ఎనిమిదిమందుంటారు ఎక్కుతుంటే కండక్టరు మాస్కులేసుకోకపోతే దించేస్తా అనడంతో తప్పక వేసుకుని ఎక్కారు. కొందరు వెనక్కి వెళ్ళి చివరి సీట్లో కూర్చొంటే కొందరు మాత్రం అమ్మాయిల సీట్ల పక్కగా నిలబడి ఆ అమ్మాయిలపై చూపులవ కురిపిస్తున్నారు. అయిదు నిమిషాలకి ఆ అమ్మాయిలు దిగిపోయారు. తరువాత స్టాపు లో పీచు ఫ్యాక్టరీ దగ్గర ఆ అబ్బాయిలు దిగిపోయారు.
ఇలా ఈ మూడు కధలు చూసిన నా కళ్ళుఇంకా కధలకై వెతికాయి.అలావెతుకుతుండగా బస్సు హారను వినిపించి చూస్తే మా ఊరు.ఇంకానయందాటిపోలేదు అనుకుని నా సామాన్లన్నీ పట్టుకునిబస్సు దిగాను.
By Kruthika Mantha

Comments