నా దేశంలో
By Srinivas Putta
నేను చూసాను నా దేశంలో
పేదవాడు ఆకలితో వేసే కేకలని,
బలిసినొడు అరగనీకి చేసే వాకులని,
ప్రశ్నించే ధైర్యం లేక సామాన్యుడు నోటికి వేసుకున్న లాకులని.
నేను చూసాను నా దేశంలో
ఫుట్పాత్ పై పురుడు పోసుకున్న పాపాలని,
రెడ్ క్లాత్ పై ధర్జాగా తిరిగే దుర్మార్గాలని,
పోలింగ్ బూతుల్లో పడగలు విప్పుతున్న ప్రజాస్వామ్యాన్ని.
నేను చూసాను నా దేశంలో
వేడి టీ కప్పులో ఆవిరైతున్న అందమైన బాల్యాన్ని,
అంగట్లో అమ్మకానికి పెట్టిన ఆడదాని శీలాన్ని,
కాసులకు అమ్ముడు పోయిన పత్రికల కలాన్ని.
నేను చూసాను నా దేశంలో.
అంబరాన్ని అంటే అద్దాలమేడల తలుకులని,
మనసు బాధను మరుగు చేసుటకు వేశ్య వేసుకున్న సోకులని,
మెతుకుల కోసం ముసలి తాత చెప్పులకి కొట్టే మేకులని.
నేను చూసాను నా దేశంలో
పట్టణాల మోజులో పడి నలిగిన పల్లెలని,
పల్లెలు విడిచిన కొడుకులకై వేచి చూసే తల్లులని,
గజిబిజిగా బిజీబిజీగా తిరుగుతున్న శతకోటి జనులని.
నేను చూసాను నా దేశంలో
పుణ్య నదులలో పారుతున్న మురికిని,
అభివృద్ధి అటక మీద పెడుతున్న గురకని,
మరుగున పడుతున్న మానవత్వపు ఉనికిని.
నేను చూసాను నా దేశంలో
దినదినం తరుగుతున్న ప్రకృతిని,
అనుక్షణం పెరుగుతున్న వికృతిని,
పాతాళపు లోలోతుల్లోకి జారుతున్న సంస్కృతిని.
నేను చూసాను నా దేశంలో.
అవినీతికి వచ్చిన అపరిమిత స్వాతంత్ర్యాన్ని.
అక్రమాలకు వచ్చిన అందమైన స్వరాజ్యాన్ని.
అలుపెరగక పోరాడి తెచ్చుకున్న ఆకలి చావుల బహుమానాన్ని.
ఇన్ని చూసినా ఎవరు ఎన్ని చేసినా దిక్కులన్నీ దద్దరిల్లేలా నేనంటాను. మేరా భారత్
మహాన్.
70 వసంతాల స్వాతంత్రభారతం అభివృద్ధి చెందలేదా.
ఎందుకు లేదు దినదినము క్షణక్షణము చెందుతూనే ఉంది.
కోట్లు కోట్లు కొల్లగట్టడంలో.
గవర్నమెంట్లు కూల గొట్టండంలో.
లేనివాడిదగ్గర దోచుకోవడంలో.
ఉన్నవాడివి దాచిపెట్టడంలో.
స్త్రీలను చెడగొట్టడంలో.
పక్కవాడిని పడగొట్టడంలో.
న్యాయానికి వెలకట్టడంలో.
ఇన్ని చూసిన ఎవరు ఎన్ని చేసినా నేనంటాను మేరా భారత్ మహాన్. ఎందుకంటే.??
అడవినే అమ్మగా భావించి ప్రాణాలను అర్పించిన అల్లూరి, కొమరంభీమ్.
పురుషాధిక్య సమాజంలో స్ర్తీలో దాగి ఉన్న పరాశక్తిని చూపిన రుద్రమ,
లక్ష్మీబాయి.
సత్యాహింసలను ఆయుధాలు చేసి ఆంగ్లేయుల అధికార కోటలను కూల్చిన బోసినవ్వుల
బాపూజీ.
జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన వివేకానంద, అబ్దుల్ కలామ్.
లెక్కలకే చుక్కలు చూపిన రామానుజన్, శలుంతలదేవి..
తన కలంతో రచనలకు కొత్త కళ తెచ్చిన ఠాగూర్, శ్రీశ్రీ, తిలక్..
ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన నేల నాది..
వేదాలు పురాణేతిహాసాలు సకల శాస్త్రాలు పురుడు పోసుకున్న పుణ్యభూమి నాది..
అందుకే నేనంటాను
మేరా భారత్ మహాన్.
మేరా భారత్ మహాన్.
మేరా భారత్ మహాన్.
By Srinivas Putta

Comments