నీతో గొడవ పడాలని ఉంది (రైతు గురించి)
- Hashtag Kalakar
- Dec 3, 2025
- 1 min read
By Dr. Samudrala Priskilla
రైతు?..
ఇంకెక్కడే రైతు....!
భూపంపిణి?..
ఏది భూపంపిణి..!
లెక్కలు?....
తప్పుడు లెక్కలు..!
ఇక చెప్పకు?...
నువ్వు వాగకు....!
కష్టపడేది రైతు
నష్టపోయేది రైతు
చితికిపోయింది రైతు
చిత్తయిపోయింది రైతు..
మరి బాగున్నోళ్ళు?...
దోపిడీ దారీ వ్యవస్థనడుగు
జమీందారీ వ్యవస్థనడుగు
దళారీ వ్యవస్థనడుగు
ఏమి ఎరగనట్టు నంగనాచిలా
నడచిపోతున్న
రాజకీయ వ్యవస్థనడుగు
రబీ అనీ ఖరీఫనీ
మిరపనీ మినుమనీ
జనుమనీ జొన్ననీ
పంటనీ పైరనీ
వాననీ మబ్బనీ
ఏదీ కుదరక పురుగుమందు డబ్బా అనీ
ఇంకేమన్నా అంటే ఇంట్లో ఉరి తాడనీ
రైతుకి జీవితం ఇంకెక్కడదనీ
అందుకే అంటాను
రైతు నేత్రంతో చూడమనీ....
చాల్లేవే నీ మాటలు?..
చాలనివేవి..! చెల్లనివేవీ....!
చెల్లీ కల్లలు కావేవీ....!
రైతు భార్యల కన్నీటి మడుగున తడిసిన
రైతు శోక సముద్రపు అడుగున తడిసిన
రైతు బిడ్డల భవిష్యత్తు పై నిప్పులు పోసిన
నివురుగప్పిన నిజాల క్షణాలనడుగు
ఆత్మదీపాన్ని ఆర్పేసిన ఆ నిమిషాలనడుగు..
ఇంకా అర్ధం కాకపోతే
ఆకలి కేకల అలజడుల మధ్య
ఎండిపోయిన రైతుల పేగులనడుగు
కన్నీటిజడుల మధ్య తడిసి కుళ్ళిన
రైతు కళ్ళ కళేబరాలనడుగు
మట్టి పిసికిన చేతుల సాక్షిగా
నిర్రన నీలిగి పోయిన రైతు దేహాన్ని అడుగు
ఇంకా తీరకపోతే…
రైతు దేహంపై ఇన్వెస్టిగేషన్
చేసిన పురుగులనడుగు
ఆవేశం... ఆక్రోశం...
ఏవిటే...ఎక్కడికే...
నన్ను విడిచి వెళ్లకే
రావద్దని వారించకే
నీతో గొడవపడాలని ఉందే
మళ్ళీ నేనే తగ్గాలని ఉంది
రైతుల కోసం నువ్వు పడే తపన
నా నరనరాల్లో నింపుకోవాలని ఉంది..
మళ్ళీ నిన్ను చూడాలని ఉంది
నీతో గొడవపడాలని ఉంది
అక్కా!
నా మనసు నీ కోసం ఎదురుచూస్తుంది..
నీతో గొడవపడాలని ఉంది..
By Dr. Samudrala Priskilla

Excellent
Good
Awesome 💯
Good👍
🥰