తుది వరకు
By Kruthika Mantha
సుముహూర్తం!!!
వధూవరులు ఒకరి శిరస్సు పై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని
మీ నయనాలు మమేకం చేసుకోండి.
అప్పుడు చూసాను ఆ కళ్ళని
ఎంత ఠీవీ గా ఉన్నాయి
అంత ఠీవి కాస్త ఒక్కసారిగా చిలిపిగా మారిపోయాయి
అంతే టక్కున తల దించేశాను
అంతసేపు చూడొచ్చో చూడకూడదో తెలీదు
అదేనేమో బహుశా తొలి చూపు…
ధర్మరాజంతటి ఆజనుబాహుడేమికాదు కానీ
నా పైన ఒక రెండు గుప్పెడ్లుంటాడు
చక్కటి శరీరశౌష్టవం
ఆ మధుపర్కల పంచెలో పైన ఉత్తరీయం ఇంకా జంధ్యం
బుగ్గన చుక్కా కళ్యాణతిలకంతో
నాన్న చెప్పిన పోలికలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాడు
ఆయన్ని అదే మొదటిసారి పూర్తిగా చూడటము
మరి అదేనేమో తొలి వలపు….
అలా నా మెడలో తాలి కట్టి ఏడడుగులు వేస్తూ
నాతిచరామి అన్న ఆ మాటలు
ఆయనతో నాకు అవే తొలి సంభాషణలు….
మరి పెళ్లి చూపులూ? అడిగింది పదేళ్ల లలిత –
పెళ్లి చూపులా……..
అలాంటివేమీ లేవప్పటికాలంలో
అప్పట్నుంచీ ఆయన వెనకే నడిచావా??
అది మొదలు ఆరోజునుంచి
అక్కడ కాలుతోందే ఆ డెబ్భై ఏళ్ల శరీరం
అది అలా కాలడానికి ముందు వరకు
ఈ ముసల్దాన్ని తన వెనకే….
కాదు కాదు..
తన పక్కనే నడిపించాడు.
By Kruthika Mantha

Comments