చెదిరిన బాల్యం
By Srinivas Putta
అల్లరి చేస్తూ హాయిగా తిరగాల్సిన వయసులో,
బస్టాపుల్లో, ట్రాఫిక్ సిగ్నల్లలో, మాసిన తనువుతో చిల్లరకై అరచేతిని చాచి
అర్ధించే పిల్లల బ్రతుకులలో
ఆ బాధలు రాసిందెవరు,
పుట్టుకలోనే అమ్మా నాన్నలను దూరం చేసి అనాధలుగా మార్చిన బ్రహ్మా??
లేక
మదమెక్కి తిరిగి మొలిచిన మొక్కని చెత్తలో వేసి చేతులు దులుపుకున్న అమ్మకాని
అమ్మా?
లేక
కట్టుకున్నది కాలం చేస్తే మద్యానికి బానిసై బాధ్యతలు మరచిన తాగుబోతు
నాన్న?
లేక
పాపపు సొమ్ము కోసం కన్నవారికి దూరంచేసి హైటెక్కు బిచ్చగాళ్లకి అమ్మేసిన
ఆయమ్మా??
తప్పు ఎవరిదైనా మసక బారింది ఆ పసిమనసులే.
ఆ మసకలు కాలంతో పాటే కరడుగట్టి,
మనసులేని మానవజాతిపై పగబట్టి,
మొదలెట్టును మహా విధ్వసం.
ఆ రాక్షసత్వానికి నిలువెత్తు రూపమిచ్చి
ఈ మూర్ఖపు లోకంపైకి వదిలి ఉన్న కొంత
మంచితనాన్ని తగలబెట్టి తన పబ్బం
గడుపుతుంది గద్దెనెక్కిన దుర్మార్గం.
ఆ రాజకీయ రాబందుల కోరల్లో చిక్కుకుని
రెక్కలు విరిగిన ప్రజాస్వామ్యం తన ప్రాణాలను
కోల్పోయి సామ్రాజ్యవాద పునాదుల్లో సమాధి
కాకముందే కళ్ళు తెరిచి చూడు ఓ సిగ్గులేని
సమాజమా!!
ఎవడెక్కడ పొతే నాకెందుకులే అనుకుని
నీ పురోగతికై పదిమందిని పడదోయకు.
ప్రభుత్వమంతా నాదేనని పేదవాడి
సొమ్ముని పందికొక్కులా తిని తెగబలవకు.
చుట్టూరా మురికిని నింపి నీ ఇంటిని
పదివరసలు పైపైకి పెంచుకోకు.
ఎంత పైకి ఎక్కిన చివరకు
ఈ కాలం నిను మట్టుబెట్టి
నుదుటిన పావలా బిళ్ళ పెట్టి.
తెల్లన్ని గుడ్డలో మూటకట్టి.
ఈ మట్టిలోనే కప్పెడుతుంది.
కనుకే ఉన్నన్నాళ్లు మంచిని పంచి మనిషిలా బ్రతుకి.
పోయాక కూడా చరితల నింగిలో చుక్కలా వెలుగు
By Srinivas Putta

Comments