ఆమె...ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి
- Hashtag Kalakar
- Aug 13
- 2 min read
By Nanubolu Rajasekhar
వినాస్త్రీయ జననం నాస్తి (స్త్రీ లేకపోతే జననం లేదు), వినాస్త్రీయ గమనం నాస్తి (స్త్రీ లేకపోతే గమనం లేదు), వినాస్త్రీయ జీవం నాస్తి (స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు), వినాస్త్రీయ సృష్టియేవ నాస్తి (స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు) అని సినిమా మాధ్యమాలలో మన కథానాయకులు చెప్పే డైలాగులకు ప్రేక్షకులు కరతాల ధ్వనులతో బ్రహ్మరథం పట్టిన దృశ్యాలను చూస్తుంటేనే అర్థమవుతుంది, సమాజంలో స్త్రీ పై ఉన్న గౌరవం. స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, సోదరిగా, స్నేహితురాలిగా, భార్యగా, తల్లిగా, పిన్నిగా, పెద్దమ్మగా, అత్తగా, నానమ్మగా, అమ్మమ్మగా ఇలా ప్రతి దశలోనూ తనదైనశైలిలో ప్రేమానురాగాలను పంచుతునే ఉంటుంది. సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ... అని కవి కలం రాసినది అక్షర సత్యమేగా.
”యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అని మనుస్మృతిలో చెప్పబడినది. అంటే ”ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు” అని అర్థం. కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా స్త్రీని గౌరవిస్తేనే దాని గౌరవం ఇనుమడిస్తుంది. స్త్రీ యొక్క ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నతమైన సంస్కారం, ఉజ్వలమైన శీలం కుటుంబానికే కాదు దేశానికే గర్వకారణమవుతుంది. క్రీ.పూ. 6000 సంవత్సరాలకు పూర్వం నుండి అనగా సింధూనాగరికత కాలం నుండి భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే స్వాతంత్రోద్యమం అనంతరం ఏర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా ”భారతమాత” గా కొనియాడుతూ, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
మహిళ ఓ సవ్యసాచి:
”విద్యా సమస్తాస్తవన దేవి భేదాః స్త్రీయః నమస్తాః సకల జగత్సు” అనే దేవీ భాగవతంలోని శ్లోకంలో స్త్రీని మాతృమూర్తిగానే గాక, జగన్మాతృమూర్తిగా వర్ణించారు. మన వేద, పురాణ, ఇతిహాసాలన్నీ స్త్రీని ఆదిపరాశక్తిగా కీర్తించాయి. సమాజాభివృద్ధిలో ఆమె పోషించే పాత్రను అభినందించాయి. అనాటి కాలం నుంచి ఈనాటివరకు సమాజంలో స్త్రీ ఎప్పటికప్పుడు తనను తాను నవీకరించుకుంటూ నిరూపించుకుంటూనే ఉంది. బంధాలను పటిష్టపరిచి కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచి గృహమనే సామ్రాజ్యాన్ని అహంకారంతో కాక ఆప్యాయతతో పరిపాలించే ఉత్తమ ఇల్లాలుగా, పిల్లలకు తల్లిగా, మొదటి గురువుగా ఉత్తమ గుణాలను నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. తన ఆలనా పాలనలతో కుటుంబాన్ని తీర్చిదిద్దటమే కాదు, ఆర్థికంగా కూడా తన కుటుంబాన్ని పోషిస్తుంది నేటి మహిళ. అటు కుటుంబ అభివృద్ధిలోనూ ఇటు సమాజ అభివృద్ధిలోనూ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న మహిళ నిజంగానే ఓ సవ్యసాచి.
మహిళ ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి:
స్త్రీకి ఎన్నో పరిమితులు ఉన్న ఆరోజుల్లోనే, బ్రిటీష్ వారి అరాచకాలకు వ్యతిరేకంగా సరోజినీ నాయుడు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, సరళా దేబీ చౌధురాణి, అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ లాంటి ఎందరో మహిళలు బ్రిటిష్ పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ధైర్యంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని బ్రిటీష్ పాలకులను దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగి, మహిళలలో ఉన్న ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి ప్రతిరూపమై భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారు. అంటే కుసుమ కోమలంగా కనిపించే మహిళ అవసరమైతే కఠినత్వాన్ని ప్రదర్శించి భద్రకాళిలా భయ పెట్టగలదు, సత్యభామలా దుష్ట శిక్షణ చేయగలదు, రుద్రమదేవిలా యుద్ధమూ చేయగలదు. అందుకే మహిళను ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించవచ్చు.
మహిళా దినోత్సవం- వీరనారీమణుల త్యాగఫలం:
ఒకప్పుడు సమాజంలో మహిళ పాత్ర పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయబడ్డాది. విద్య, ఉద్యోగం మరియు రాజకీయాలకు వారిని దూరంగా ఉంచేవారు. తరచుగా వివక్షకు గురవుతూ సామాజిక నిబంధనలతో జీవించేవారు. 1900లో ఉద్భవించిన మహిళా హక్కుల ఉద్యమాలు, ఈ అసమానతలను సవాలు చేయడానికి మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఎంతగానో దోహదబడ్డాయి. ఆ ఉద్యమాల ఫలితంగానే మనం నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పనిగంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా మరియు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్ తోనూ 1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం, మహిళా హక్కుల ఉద్యమ నేత కార్లా జెట్కిన్ నేతృత్వంలో 15 వేల మహిళా కార్మికులు వీరోచిత పోరాటాన్ని చేశారు. ఆ వీర మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో, రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా చక్రవర్తి నిక్రోలస్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరప్ మహిళలు మార్చి 8న శాంతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకునే 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" గా ప్రకటించింది.
మహిళ సాధిస్తున్న విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు:
ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర కాలానుగుణంగా మార్పు చెందుతూ పురోగతివైపు దూసుకుపోతుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక చైతన్యంతో వివిధ రంగాల్లో మహిళలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. ఒకప్పుడు పురుషాధిపత్యంగా ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ వంటి అప్లికేషన్ ఓరియెంటెడ్ కోర్సులను విజయవంతంగా చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో శారీరిక, మానసిక ఒత్తిడిని సైతం తట్టుకొని పురుషులతో సమానంగా అన్ని రకాల ఉద్యోగాలను చేస్తున్నారు. అంతేకాదు, వ్యాపార, రాజకీయ రంగాలలో మంచి విజయాలను సాధిస్తున్నారు. క్రీడారంగంలో కూడా పురుషులతో పోటీపడి పథకాలను సాధిస్తున్నారు. తమ హక్కుల పరిరక్షణకు వివిధ వేదికలపై వాదిస్తూ పోరాడుతూ సామాజిక క్రియాశీలతలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుష గుత్తాధిపత్యంగా ఉన్న అంతరిక్ష పై కూడా తమ సత్తా చాటిన వీర మహిళామణులు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయాలు. మహిళలు విజయాలు సాధిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నిసవాళ్లను మరియు అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు, లింగ వివక్ష, విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణను పొందడంలో అడ్డంకులు, వేతన అసమానతలు, మానవ అక్రమ రవాణ, వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
మహిళ సాధికారికతలో, సవాళ్ల పరిష్కారంలో ప్రభుత్వాల పాత్ర:
అసమానతలను రూపుమాపి, మహిళా సాధికారికతను ప్రోత్సహించడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు వివిధ ఆరోగ్య మరియు సంక్షేమ పథకాలను, చట్టాలను, అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. సాధికారికతను ప్రోత్సహించేందుకు మహిళా శక్తి కేంద్రాల ద్వారా విద్య , శిక్షణ, ఆర్థిక సాధికారత, నాయకత్వ అభివృద్ధి మొదలగు కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపకల్పన చేస్తున్నాయి. లింగ-ఆధారిత హింసను నిరోధించడానికి, సమానత్వాన్ని, సమాన వేతనాన్ని ప్రోత్సహించడానికి, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయి. మీటూ మరియు టైమ్సప్ వంటి సామాజిక ఉద్యమాలు లింగ ఆధారిత హింసపై, మహిళా సాధికారికతపై అవగాహనను కల్పిస్తున్నాయి. 2015లో ఆమోదించబడిన SDG (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్) లు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు మహిళలకు, బాలికలకు సాధికారత కల్పించడానికి నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉన్నాయి.
ముగింపు మాటగా... వ్యవస్థాగత అసమానతలను, పక్షపాతాలను, అవరోధాలను , అడ్డంకులను ఛేదించుకుని మహిళా హక్కుల కోసం న్యాయపోరాటాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు గుర్తింపును తీసుకొచ్చిన వీర వనితలందరినీ స్మరించుకుని వారు చేసిన పోరాటాలను, త్యాగాలను కొనియాడుదాము. ముఖ్యంగా, నేటి మహిళ శక్తి యుక్తులను, సాధించిన విజయాలను, సాధిస్తున్న పురోగతిని ప్రశంసిద్దాం. సాధించాలనుకుంటున్న వారి ఆశయాలకు , లక్ష్యాలకు ప్రోత్సాహంగా ఉందాం. ప్రతి స్త్రీ స్వేచ్ఛగా అభివృద్ధి చెందగల, గౌరవంగా జీవించగల, హింస రహిత, వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి కృషి చేయ్యాలి. వంట గదిలో షడ్రుచులను తయారుచేసి అందరికీ అమ్మలా వడ్డించే ఆమె నేడు ప్రపంచ స్థాయిలో అన్ని రంగాలలో సాధిస్తున్న పురోగతి, అందుకు అనుగుణంగా ఆమె చెందుతున్న రూపాంతరం అమోఘం, అద్భుతం, అభినందనీయం.
By Nanubolu Rajasekhar

Comments