ఆడపిల్ల ఆవేదన
By Sitadevi Padala
పుట్టుతో చీత్కారాలు
వయసొచ్చిన నీ స్వేచ్ఛకు బలాత్కారాలు
సమాజవృద్దికి ఎన్నెన్నో నీ వంతు శ్రీకారాలు
ఎన్ని తరాలు ఎదుర్కోవాలి ఈ కర్కశకోరలు
భారత సంస్కృతికి చీర కడితే నువ్వు
భావితరాల భవితకు బాటవుతావు
తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలకు నీడవుతావు
తల వంచుకునే విలువలు కాపాడతావు
ఆదిశక్తి ఆవేదనకు అంతు లేదా
మహాలక్ష్మి మానానికి మర్యాద లేదా
ఆనాటి రావణ అంతం,రామ విజయం నిజమయితే
ఈనాటి సీత పక్షాన స్త్రీ రక్షణ చేసేదెవరు
కుటుంబ ఆంక్షలు అడ్డుకట్టి
ఆశయాల అన్వేషణలో నీవుంటే
మమకారానికి అధికారాన్ని జోడిస్తుంటే
చివరకు కామాంధుల కర్కశ చేతిలో
ఊపిరాడని నిస్సహాయ స్థితిలో నీవుంటే
డిగ్రీలు నేర్పిన పాఠాలు నేలపాల?
P.H.D lu పొందిన జ్ఞానం గంగపాల?
ఆనాటి కురుసభ లో కుతంత్రానికే కురుక్షేత్రం జరిగితే
ఈనాటి కామాంధుల క్రోధాన్ని ఖండించేదెవరు
చెరిగిన నీ కలల్ని చూసి
చితికిన నీ జీవితాన్ని చూసి
సమాజం స్టేటస్ లలో సంతాపాన్ని,
సానుభూతిని తెలుపుతుంది తప్ప
సాయం చేయడానికి, శిక్ష వేయడానికి సమయం లేకపోయే
పాపి ప్రాణ భయంతో పరుగులు తీసే పరిస్థితి రాకపోయే
అమ్మ రొమ్ముపాల రక్తంతో కాదా పెరిగినది?
అమ్మ అంగుళి పట్టి కాదా అడుగు నేర్చినది?
ఆనాటి లక్ష్మీబాయి, రుద్రమదేవిల
సాహసాల ప్రశంస నిజం అయితే
ఈనాటి అభయ, దిశ చట్టాల
సహకార ప్రచారాలెందుకు ??
మొన్న నిర్భయ, నిన్న ప్రియాంక, ఈ రోజు….
ఇంక చాలు… వినే శక్తి లేదు మాకు
ప్రియమైన సోదరులారా !!!
భావి భారత ఆడపడుచులను బ్రతకనివ్వండి
అమ్మతనం మానం కోసం అర్రులు చాచే పరిస్థితి రానివ్వకండి
దహించే కాలానికి దర్జాగా ఎదురెళ్లే దారులు వెతకండి
పిల్లలను కన్న అమృత మూర్తులార!!!
అమ్మాయిలకి ధైర్యం, అబ్బాయిలకి విలువలు నేర్పండి
నీ నుండి వచ్చే పిండాన్ని నీవు సక్రమంగా సరిదిద్దుకుంటే
బ్రహ్మాండం తానంతట తానుగా బాగుపడుతుంది అన్న నరేన్ మాటలు వినండి.
By Sitadevi Padala

Comments