OT Room లో నేను
- Hashtag Kalakar
- Jan 6, 2023
- 1 min read
Updated: Jul 27
By Kruthika Mantha
ఈ సారైనా కళ్ళు తిరగకుండా ఉంటాయా మూడు గంటలు నిలబడి చూస్తానా పోని కనీసం సగం సేపు అయినా ఉంటానా అనే ప్రశ్నలతో ఆపరేషన్ ధియేటర్ లో భయం భయం గా అడుగుపెట్టాను. నేనొక మెడికల్ స్టూడెంట్ ని అయినా సెకండ్ ఇయర్ నుంచి ఆపరేషన్లు చూడాలంటే చచ్చేంత భయం.అడుగుపెట్టానోలేదో అనెస్థీషియా వాసన గుప్పున వచ్చింది. ఇంక మళ్ళీ మొదలైంది ఇంక పదిహేను నిమిషాలే అక్కడ నిలబడగలనేమో అనుకుంటున్నపుడు చూసాను.
ఎదురుకుండా బల్ల పైన డెలివరికి గల ఆమెని పడుకోపెట్టి చుట్టూ నలుగురుకు పైగా డాక్టర్లు ఆపరేషను చేస్తున్నారు – నేను ధియేటర్ లోకి అడుగుపెట్టిన రెండు నిమిషాలకే బిడ్డను అలా బయటకు తీసారు.
బయటకు తీసిన బిడ్డని తల్లి రెండు కాళ్ళ పై కప్పబడిన బట్ట పై పెట్టి ముక్కు నోరు రంధ్రాల నుండి Suction చేసారు. అప్పుడు ఏడ్చాడు బాబు. ఆ చంటి బిడ్డ ఏడుపు ధైర్యాన్ని ఇచ్చింది.
అదే ఆసుపత్రి అదే డాక్టర్లు, అదే డెలివరాలు అదే డెలివరీ పద్దతులు కానీ రెండు సంవత్సరాల క్రితం ఉన్న ఆ బెరుకూ ఆ కళ్ళు తిరగడం కడుపు తీప్పడం అవేం లేవు ఇపుడు….
నేను నాలుగు డెలివరీలు చూసాను ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, పుట్టిన బిడ్డని వెంటనే బేబీ అనే ఆమెకి ఇచ్చారు. ఆవిడ థియటర్ లో ఒక పక్కన ఆ తల్లి తాలుకా వాళ్ళిచ్చిన చిరను చేత పట్టుకుని రెడి గా ఉంటుంది. బిడ్డని వెంటనే తీసుకుని బయటకు తీసుకెళ్ళి ఉమ్మనీరు తుడిచి శుభ్రం చేసి తీసుకొచ్చి తల్లికి చూపించారు. అప్పుడామె మొహంలో నవ్వుని చూడాల్సింది. మన ఆనందాలేవి సరిపోవు.
అది మొదలు మిగిలిన మూడు చాలా నవ్వుతూ చూసేసా, నాలుగో డెలివరీ అనుకుంటా, పుట్టిన పాప మొహం ఇంకా మర్చిపోలేకపోతున్నా. అంత సేపు పిల్లకాలువ ఈదుకుంటూ ఈ సువిశాల ప్రపంచంలో పడిన ఆ బిడ్డ మొహం ఆనందం , బాధ, భయం, అమాయకత్వం తో పాటు అల్లరినీ అలుముకుంది.
ఆ పొట్ట కోయడం బిడ్డను తీయడం కుట్లువేయడం వాటి మధ్య ఆ రక్తం అవన్ని ఒకప్పుడు భయంగా కనిపించాయి. ఇప్పుడు అందంగా ఆనందంగా ఇంక తర్వాత కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో కదా…..
By Kruthika Mantha

Comments