By Revanth
తన తల్లిని తీస్కొని గుడికి వెళ్ళాడు రాహుల్.
"గుడిలోకి రారా! ఇక్కడ వరకు వచ్చి గుడిలోకి రాకపోతే పుణ్యం ఎలా వస్తుంది."
" నేను వచ్చింది కేవలం నిన్ను దింపడానికి. నువ్వు వెళ్ళి నీ పుణ్యాలు, పాపాలు చుస్కొని రా."
లోపలికి వెళ్ళేముందు గుడి బయట ఉన్న ఇద్దరు బిచ్చగాళ్లకు (దురదృష్టవంతులు)పది రూపాయలు ఇచ్చారు రాహుల్ తల్లి శాంతమ్మ.
దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని గుడి హుండీలో నూట ఒక్క రూపాయి వేశారు.
అలాగే ఆవిడకు శఠగోపం పెట్టిన పూజారిగారి పళ్ళెంలో యాభై ఒక్క రూపాయి పెట్టారు.
ఇదే సమయంలో ఆ ఇద్దరు బిచ్చగాళ్ళు రాహుల్ కళ్ళలో పడ్డారు.
భక్తులు ఎక్కువ లేక ఆరోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ లేనట్టు ఉన్నాయి.
వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు. తిన్నారా అని అడిగాడు. లేదు అన్నారు వాళ్ళు.
పక్కన ఉన్న టిఫిన్ షాపులో నలభై రూపాయలు పెట్టి టిఫిన్ కొని వాళ్ళకి ఇచ్చాడు.
గుడిలో శాంతమ్మ కొట్టిన గంటలు మోగుతున్న సమయంలో ఆ ఇద్దరి ముసలి వాళ్ళ కడుపులో మంటలు ఆగుతున్నాయి.
మధ్యాహ్నం భోజనం గురించి అడిగాడు రాహుల్. వాళ్ళ నుండి సమాధానం రాలేదు. దగ్గర్లో హోటల్ కి వెళ్ళి ఆ ఇద్దరకీ మధ్యాహ్నం భోజనాలు పెట్టమని చెప్పి వంద రూపాయలు ఇచ్చాడు.
శాంతమ్మ బైటకు రావడంతో ఆవిడని తీస్కొని ఇంటికి వెళ్లిపోయాడు రాహుల్.
ఇదంతా చూసిన నేను సందిగ్ధంలో పడ్డాను. శాంతమ్మ గారు చెప్పిన ఆ పుణ్యం ఎవర్కి వస్తుందా అని ఆలోచించాను.
వేదాలు చదివిన పూజారిగారు దీవించిన "శతమానం భవతి" కి పుణ్యఫలం ఎక్కువా లేక
తిండికి కూడా కష్టపడుతున్న దురదృష్టవంతులు పొందిన ఆనందం ( ఒక విధంగా అన్నదాత సుఖీభవ దీవెన) కి పుణ్యఫలం ఎక్కువా?
అర్ధగంట సేపు దేవుని నామస్మరణ తప్ప మరో తలపు లేని శాంతమ్మ గారికి ఎక్కువ పుణ్యం వస్తుందా లేక అరక్షణం కూడా దేవుని కోసం కాకుండా మరో మనిషి కోసం ఆలోచించిన రాహుల్ కా?
"మానవ సేవే మాధవ సేవ" అన్న ప్రవచనం నమ్మాలా లేక "దైవ చింతనే మోక్షానికి మార్గం" అన్న వాఖ్యన్ని ఆచరించలా??
By Revanth
This made me think
Thoughtful bro
Well said
👏👏👏👏
Super bro