నీడ
By Srinivas Putta
వెలుగుల ఉదయం ఎదురువస్తే, నేనున్నానంటూ వస్తావు.
ప్రతి అడుగులో, ప్రతినడకలో వెంటే ఉంటూ భరోసా ఇస్తావు
నేనంటే నీవంటు,నీవెంటే నేనంటూ భ్రమింప చేస్తావు ఎటూ చూసినా నేనేనంటావు.
కోపంమంతా నెత్తికెక్కి రగిలిపోతుంటే చిన్నబోయి పాదాల చాటుకి దాక్కుంటావు,
సంధ్య కిరణాలు హృదయాన్ని తాకువేళ, పరవశంతో ఉప్పొంగి పర్లాంగులు పెరుగుతావు.
ఓటమి రాతిరి వెంటపడితే నిశీధిలోకి పరిగెడతావు,
సాగే జీవన పోరులో ఒంటరి నీవని వదిలేస్తావు,
మరునాడు మళ్లీ కొత్తగా ముడిపడతావు.
నాతో పాటే పెరిగావు. నాతో పాటే తిరిగావు.
ఎవరెవరో వచ్చారు ఎవరెవరో పోయారు.
అయినా నాతోనే ఉన్నావు.
బతుకు కడదాక నాతోనే అన్నావు.
నీవేవరివి? నాకేమవుతావు?
ఎందుకోయి నీకు నేనంటే అంత ఇష్టం.?
ఏం అడిగినా చెప్పవేంటి మాటలు రావా నీకు.
By Srinivas Putta

Comments