శ్రీహరి సంస్తుతి
- Hashtag Kalakar
- May 10, 2023
- 1 min read
By Pharshy Venugopla Rao
(ఉత్పలమాల)
దీనకుజీవనాతపహతిన్ మధుపానము నష్టవాసనా
జ్ఞాన మఘౌఘఘూర్ణనఘనాఘనఘాతఘనప్రభంజన
ధ్వానము దివ్యదీధితినిధానము బ్రహ్మపదార్థసౌధసో
పానము గాదె! నీ పరమ పావన గానము, శౌరి! శ్రీహరీ!
(చంపకమాల)
విషధరరాట్ఫణమ్ముపయి వే నలవోకగ నాడువాఁడు, న
వ్విషధరుమైత్రిమై సకలవిష్టపముల్ కనువాఁడు, వేనలిన్
విషధరభుక్కుపింఛమును వేడుక నుంచెడువాఁడు, సంతమున్
విషధరుతల్పమంద శయనించెడువాఁడు హరింపలేడె? కి
ల్బిషవిషభీషణాగ్నిఁ
గురిపించి కృపామృతవృష్టి, శ్రీహరీ!
(ఉత్పలమాల)
ఆసలనంతమైన గగనాంతరరంగమునందు భక్తివి
శ్వాసమరుత్తరంగములువాఱఁగ నింద్రియకామనాగ్నికీ
లాసలిలమ్మునౌ ఘనవిరాగముతోడ శిలాప్రగాఢస
న్న్యాసమ పాంచభౌతికపుఁబ్రాణికి సార్థకమౌను, శ్రీహరీ!
(చంపకమాల)
విరిసెడు పుణ్యసూనతతి వ్రేటిడు కంటకపాపరాశితోఁ
బెరిగెడు జీవనోపవనవృక్షము గూలియుఁగాలగర్భమం
దెరువుల పాపపుణ్యముల నేర్పడు నూతనదేహమొప్పఁగా
మఱుసటి జన్మ యెత్తుగద! మర్త్యజగత్తున, శౌరి! శ్రీహరీ!
(ఉత్పలమాల)
క్రమ్మెడు కామకాలనిశి, క్రాలెడు క్రోధపు కారుచిచ్చు, గా
ఢమ్మగు లోభపంకమును, డాఁకొను మోహపుజాలమున్ సుడిం
ద్రమ్ము మదోగ్ర ఝంఝ, వికృతమ్మగు మత్సరతామృగప్రహా
రమ్ము మనోవనమ్మెటు తరమ్మగునో? తరియింప, శ్రీహరీ!
(చంపకమాల)
చెడుగులబల్మి నెన్నడుముచిక్కెడుతీవెను నొక్కు ముందె, చి
క్కుడుకునఁజిక్కి మేవలువయున్ ముడుతల్వడుముందె, పోడుముల్
విడివడి యయ్యొడల్వడకు వేళకు ముందె, యొకింత జవ్వనం
బుడిగెడు ముందె నీ యెఱుకటూతముఁదాల్చుట మేలు, శ్రీహరీ!
(ఉత్పలమాల)
తుల్యవిహీనమర్త్యగణదుర్గమజన్మమునెత్తి యోగసా
ఫల్యవికాసబుద్ధి పరిపక్వమనస్స్థితిసాధ్యమైన కై
వల్యమునందుఁగాక తనపట్టినకాయము కేవలస్ఫుర
చ్ఛల్యనికాయమై ౘనదె! క్ష్మాతలమందున, శౌరి! శ్రీహరీ!
(ఉత్పలమాల)
నిర్వచనుల్ విధూతులయి నేరర! రుద్రులు సిద్ధసాధ్యగం
ధర్వనరాదితేయ వసుదైత్యమరుత్పితృదేవతాశ్వినీ
సర్వగణమ్ములద్భుతరసప్లవితుల్ బహుభీతితో మహా
పూర్వము విశ్వరూపము నభోనిభృతమ్మునుఁగాంౘ, శ్రీహరీ!
(ఉత్పలమాల)
ఆక్షణమెంతొ ధన్యము కదా! పరమాద్భుతదివ్యబాహుదం
ష్ట్రాక్షిపదోదరోరుముఖహస్తసహస్రక విశ్వరూపసం
వీక్షణ జేసె నర్జునుఁడు భీతియుఁబ్రీతియు నుప్పతిల్ల నో
మోక్షకరా! చరాచరవిభూతివికాసశరీర! శ్రీహరీ!
(చంపకమాల)
తరళసమీరవీచికలు దాల్చిన పిల్లనగ్రోవి మ్రోతతో
గురుతరసంసృతిప్రబలకుంజవిఖండనచండ గీతతో
నరదములయ్యె నీదుమృదులాధరముల్ రసరాగ గీతికిన్
విరసవిరాగరీతికిని వేణునినాదవినోద! శ్రీహరీ!
(ఉత్పలమాల)
ఏమని సెప్పుదున్? వికలహృజ్జలధిప్రచలత్తరంగభా
వామితఫేనపుంజముల యందునఁజిక్కినయప్డు, తీవ్రతృ
ష్ణామృగతృష్ణలందవిలి సాగెడి యప్పుడు, మోక్షతీర సంధామము సేరఁగోరి నినుదప్ప స్మరింపఁగ నెద్ది? శ్రీహరీ!
By Pharshy Venugopla Rao

Comments