శ్రీహరిస్తుతి
By Pharshy Venugopala Rao
(చంపకమాల)
కలువలఱేడు శీతసితకాంతులఁజిందఁగ నొక్కకంటఁబ్రో
జ్జ్వలపటుకాండచండతతి భానుఁడు క్రాలఁగఁబ్రక్కకంట శి
ష్టుల నొకకంటఁగాచుచునుగువ్రతులన్ మఱుకంటఁగూల్చుచున్
మలతు ధరావతారముల మానుష ధర్మపథమ్ము శ్రీహరీ!
(ఉత్పలమాల)
దుర్దశ నింద్రయాగమది దోగ్ధకు వ్యర్థము సల్ప భక్తిసౌ
హార్దము తోడ గోగిరులఁబ్రార్థిలి వర్థిలుఁడంచు నీవనన్
నిర్దయుఁడౌచు వజ్రి ధరణింగురిసెన్ శిలలంత గోట గో
వర్ధనమెత్తి కాచితివి స్పర్థ నెదుర్చుచు నిల్చి శ్రీహరీ!
(ఉత్పలమాల)
చేల బిగించి దూకితివి చింతలఁదక్కుడటంచు నెల్ల గో
పాళియుఁజేష్టలుడ్గి కడుభ్రాంతిమెయింగనుచుండెఁగాళియుం
గాలభుజంగుదర్పమడగెన్మడుఁగున్సుడులెత్తెఁగేళులన్
లీల లసించెఁబెంబడగ లేయడుగుల్నడయాడె శ్రీహరీ!
(చంపకమాల)
చెలియలికట్టఁదెంచుకొని చెంగునపొంగు తరంగభంగి మ
బ్బులవల కావలన్ వెలయుఁబున్నమివెన్నెల ౙల్లు పోల్కి మూ
తలఁదొలగింప గుప్పుమను తావుల నత్తరు పాత్రరీతి నె
చ్చెలుల యెడందలుప్పతిలుఁజేరి ముకుందుని కేళి శ్రీహరీ!
By Pharshy Venugopala Rao

Comments