శ్రీహరిలీల
By Pharshy Venugopla Rao
(చంపకమాల)
సరుచిర చంద్ర సాంద్ర హరిచందన శీతల చందనార్ద్ర మే
దుర విలసచ్ఛరీరముల దుర్భరమారశరాళి పర్వఁగా
నరిగిరి గోపికల్ వనభవార్ధనిమీలిత లోచనమ్ములన్
విరహ విభావరిన్ మధుర వేణురవమ్ములు గ్రోల శ్రీహరీ!
(ఉత్పలమాల)
అందముచిందె బృంద, మఱువందెడి డెందము, లాడె గోపికా
బృంద మమందనందమున, వీనుల విందుగ వేణువూదు గో
వింద! ముకుంద! కృష్ణ! యరవింద దళేక్షణ! సుందరీ ముఖేం
దిందిర బంధురా! యుదద దీపక దేహ! మురారి! శ్రీహరీ!
( ఉత్పలమాల)
ముప్పిరికొన్న ప్రేముడుల ముత్తెములన్ హృదయాబ్ధిగర్భమం
దొప్పుగ నిల్పి పొంగు విరహోద్ధృతిమై మధురోష్ఠ వీచి నా
ల్చిప్పల యల్కపల్కుల వచించుచు నీకు బహూకృతింబలెం
గుప్పలువోయరే! లలిత గోప లతాంగులు, శార్ఙ్గి! శ్రీహరీ!
(చంపకమాల)
అటమటఁజిక్కి లేమిని మురారియ దిక్కని గంపెడాసతో
నటుకుల మూటగట్టి హితుఁడైన నినుంగనరాఁగుచేలు ను
ద్భటముగ స్వాగతించి ప్రియవాక్కుల మైమఱువంగఁజేసి పి
మ్మట యెనలేని సంపదల మాధవ! కూర్చితి ప్రీతి, శ్రీహరీ!
(ఉత్పల మాల)
చిందులుద్రొక్కు భీముఁడనిఁజీల్చుచు భూరిబలమ్మునన్ జరా
సంధుని రెండు వ్రయ్యలుగ సవ్యగతింబడవైచె సూ! పున
స్సంధిని జీవుఁడౌటఁగని సైగగఁద్రుంపితి గడ్డిపోఁౘ నా
చందముఁదా గ్రహించి యపసవ్య గతింబరిమార్చె, శ్రీహరీ!
(ఉత్పలమాల)
సైంధవ! మస్తకమ్మిదె నిశాత శరమ్మునఁగూల్చివైతు గ
ర్వాంధ! యటంచు తీవ్రసమయమ్మునుఁబూన నరుండు వే జగ
ద్బాంధవు కృత్రిమాస్తమయ పద్ధతి తోఁపఁగఁజక్రమడ్డి స
ద్బాంధవ! పాండునందనుని వాంఛనుఁదీర్పవె, శౌరి! శ్రీహరీ!
(చంపకమాల)
కటకట! కాలుపెట్టితిటు గాటపు నోట మడుంగు సొచ్చి, ప్రాకటధయ! సంకటాపనయ! కావఁగరాఁగదె గట్టుఁజేర్ప నె
క్కటిఁ గటుదంష్ట్రల న్నికటకాలగళద్ఘటునంచు వేడ ను
త్కటఁగరి, మట్టుపెట్టితరిధారఁదృటిన్ మకరారి, శ్రీహరీ!
(ఉత్పలమాల)
తోయునదెద్ది? నీ మధుర తోయభవాంకమునందు నుండి, నా
రాయణనామ మంత్రము నిరంతరమున్ ధ్రువబాలకుండు పా
రాయణముంబొనర్చుచు వరార్థము పొందడె భక్తతారకా
శ్రేయమునే ధ్రువంబవుచుఁజేకొన నీకృప, శౌరి! శ్రీహరీ!
(చంపకమాల)
పడగలువిచ్చు నాగములవారిగ మారెను బూలమాలలై
వడివడిఁద్రొక్కవచ్చు గజపంక్తులు ముందట మ్రోకరిల్లెఁద్రా
వెడు విషమయ్యెడిన్ మధువు, వేడుకలయ్యెఁగదయ్య! వేదనల్
సడలనిబత్తితో స్మరణసల్పెడు ప్రహ్లదుఁబ్రోవ, శ్రీహరీ!
(ఉత్పలమాల)
వ్యాకృత దుర్మదఘ్న! నిజహస్తతలస్థితమస్తకుండు భ
స్మీకృతుఁడౌ తపోవరము చేకొని ధీవిపరీతభస్ముఁడు
గ్రాకృతి నాశుతోషునికెయై పరువెత్తఁబిఱుంద మోహినీ
స్వాకృతి నాటకట్టవె! యొయారపుటాటలఁగట్టి, శ్రీహరీ!
By Pharshy Venugopla Rao

Comments