Adigoo Vaadu - అదిగో వాడు
- Hashtag Kalakar
- Oct 27
- 1 min read
By Anurag Pathapally
అదిగోచూడు అదిగోచూడు
అక్కడే ఉన్నాడు వాడు
నిశ పొరల సమీక్షమై
నిరపరాదినని, నెత్తురు కక్కుతూ
విషపు కర్కాటకునిలాంటి కోరల
నాల్కను బయటికి తీస్తూ, ఏడుస్తూ, రోదిస్తూ
నిలవలేక పడిపోతున్నాడు చూడు
అదిగో అదిగో అటుకాడు
ఇటు చూడు, కుడి కాదు ఎడమవైపు
ఆ ఆ అక్కడే ఉన్నాడు వాడు
కంపట బుద్ధి కలిగి, కలి ప్రవేశించి
కలకాలాల నుండి మనల్ని వేదిస్తున్నాడు
మొర వినని మనిషి దొరని దోచే దొంగ
సైంధవ గుణచరుడు శకునికి గురువుడు
చూడు వాడిని సరిగ్గా చూడు వాడిని
కుళ్ళిపోయిన కంటిగుడ్డు నుండి రుధిరజ్వాల కారుతున్నా
లంపట బుద్ధిని ప్రయోగిస్తూ
కపట నాటకాలు ప్రదర్శిస్తున్నాడు
నిజానికి వాడికి రూపం లేదు దేహం లేదు
మన భూమికి అతిథి వాడు
మనల్నే శాసిస్తున్నాడు
నీవు జనియించిన జన్మదినమున
నిన్నెత్తుకు ముద్దాడిన నీ తండ్రి
చేతికున్న కనకంగుష్టం లోనుంచి నిన్ను చేరాడు వాడు
దొంగ వాడు, దూరినట్టు తెలపడాడు
స్వచ్ఛమైన నీ చిన్ని హృదయాన్ని
విచ్చల విడిగా దోచేశాడు
నవ్వు మాత్రమే ఎరిగిన నిన్ను
రోదన దారులపై రథ యాత్రలు చేయించాడు
మన అనే నీ మంచి గుణములోంచి
మ అక్షరము తుంచేసిన దుష్టుడువీడు
ఆనంద సమేతమైన నీ హృదయాంతర్గతల్లో
కామ క్రోధ కోటలు కట్టి వాటికి
అహంకార గోడలు అడ్డు పెట్టాడు
సర్వ సమయ సత్వవైన నిన్ను
ఈ దిగంబర నేత్రాలకి కానరాకుండా
రజస్తమో తాళ్లతో కట్టిపడేశాడు
కానీ… నేడు…
నువ్వు మారావు
అక్ష విద్య నేర్చిన నలుడి వయ్యావు
అందుకే చూడు చూడు వాడిని
కపట లంపట ధారి దుర్ముఖుడిని
నిన్ను వదిలిన ఆ ఖలుడిని
అదిగో అదిగో వాడిని చూడు
ఇక్కడ అక్కడ ఎక్కడో కాదు
దుర్గతి పొందిన వాడి దేహాన్ని
కాలిపోతున్న కరములతో పట్టి పారిపోతున్నాడు
వాడే వాడే అదిగో వాడే….
By Anurag Pathapally

Comments