By Lakshmi Supriya Sutapalli
ఈ బంధం ఎరుగదు ఏ రక్తసంబంధం
ఇది ఒక అపురూప బంధం
కడదాకా నిలుస్తుంది ఈ మనస్సుబంధం
ఇదే కదా ఇదే కదా స్నేహబంధం
కలిమి ఎరుగదు ఏ చెలిమి
వీరి ప్రేమ అన్నింటా మేలిమి
హద్దులు ఎరుగదు వీరిచ్చే మద్దతు
వీరి అనురాగానికి ఉండదు ఏ సరిహద్దు
బాధలో నేస్తం ఇచ్చే ధైర్యం
ఇస్తుంది మనకెంతో స్థైర్యం
చెప్పకనే తెలుసుకుంటారు మన ఆంతర్యం
నీడల్లే తోడుంటారు అనునిత్యం
చేరువగా ఉన్నా అల్లంత దూరాన ఉన్నా
దారులు వేరైనా చేరుకునే తీరం ఏదైనా
భావాలు వేరైనా ఆలోచించే తీరులు వేరైనా
కలంతో కష్టసుఖాలు పంచుకున్న కాలమైనా
ఇంద్రజాలం రాజ్యమేలుతున్న రోజులైనా
మారలేదు స్నేహబంధానికి ఉన్న విలువ ఎపుడైనా
మరువలేనివి కలిసి ఆడిన ఆటలు
చెరిగిపోనివి మోముపై ఆ చిరునవ్వులు
మదిలో నిలిచేవి కలిసి తిరిగిన షికార్లు
ఇవే కదా ఇవే కదా మధుర జ్ఞాపకాలు
స్నేహితులు చేస్తారు ప్రతి వేడుకలో సందడి
ప్రతి సంబరంలో ఉంటుంది వీరి హడావిడి
వీరు మోగిస్తారు డోలు బాజా
రెట్టింపు అవుతుంది మన మజా
స్నేహం మనస్సులను చేస్తుంది ఐక్యం
దరిచేరనివ్వదు ఎటువంటి వైరం
ఈ బంధం జీవితానికి ఒక గొప్ప వరం
ఎన్నటికీ తరగనిది ఈ బంధం యొక్క మాధుర్యం
By Lakshmi Supriya Sutapalli
Well written
Nice