అంబేద్కర్లారా! ఏకంకండి!!
- Hashtag Kalakar
- Dec 3
- 1 min read
By Dr. Samudrala Priskilla
మిత్రస్నేహీ!
చెప్పుల్లోంచి వెలిసిన మా విశ్వాసం తెలియాలంటే
కందిపోనివ్వని నీ కాళ్ళజోళ్ళుని అడిగి చూడు.
దళితుడు రాజ్యాంగం కోసం పరిచిన మార్గం గురించి ధూళి కూడా వాదిస్తుంది…
విసిరిన చెప్పుల్లో ధ్వనించే విభేద విద్రోహ ఘర్జనల్లో
ఇంకా చెరగని దాస్యపు గుర్తులు గురించి ప్రతివాదిస్తుంది…
నా వేలుతో నా కళ్ళనే పొడిచే, నా వేలును విరిచే
నా చేతులు నరికే, నన్నే ముద్దాయిని చేసే
ఇంటలెక్చువల్ దాడుల చరిత్రను అనువాదిస్తుంది..
గవాయ్ అన్నా!!
అంబేద్కర్ నీలో శ్వాసిస్తున్నాడు
ఇప్పుడు నువ్వొక చైతన్య గౌరవ గీతం
రక్తిమచరితల గమ్యానికి న్యాయ గేయం
చితికి పేర్చిన కట్టెల్లోంచి చీల్ల్చుకొచ్చిన చిగుటి న్యాయం
గవాయ్ అన్నా!!
అంబేద్కర్ నీలో శ్వాసిస్తున్నాడు
ఇప్పుడు నువ్వు
కన్నీరా…కాదుగా..
ఐక్య దళిత సమూహపు కళ్ళ కళ్ళకూ
అంటిన ఆత్మ గౌరవాగ్నిజ్వాల
గవాయ్ అన్నా!!
అంబేద్కర్ నీలో శ్వాసిస్తున్నాడు
ఇప్పుడు నువ్వు
న్యాయ మందిరంలో….
దళితస్వర ప్రతిధ్వనులు గుండె గుండెకూ
చేరిన బహుజన చైతన్యజ్వాల
అంబేద్కర్లారా, ఏకం కండి
అంబేద్కర్ మనలో శ్వాసిస్తున్నాడు.
పిలుపు కాదిది..పునర్జన్మ…
మీ బిడ్డల కన్నుల్లో కన్ను నిలిపి చూడండి
నూతన అంబేద్కర్ లా..నిలబడి మార్గం చూపేలా..
మీ భార్య పాదాల అడుగు పరికించి చూడండి
నేటి సావిత్రీభాయమ్మలా..భవితనుదిద్దే జ్యోతుల్లా..
అశక్తులు వర్గీకరించిన పగమంటల్లో పడిచూడకండి
వధ గొఱ్ఱెల్లా…బలి పెయ్యల్లా...
మీలోకి మీరు తొంగిచూడండి
మీరే రాజుకున్న అంబేద్కర్ ఆశయాలు.
ఆపే తరం ఇంకెవ్వరికీ లేదు..
ఆర్పే తరం ఎవ్వరికీ లేదు..
అంబేద్కర్లారా, ఏకం కండి
అంబేద్కర్ మనలో శ్వాసిస్తున్నాడు.
ఇది పిలుపు కాదు పునర్జన్మ.
బలమే నీ చదువు
చైతన్యమే నీ చరిత్ర
గౌరవం నీ ధర్మం
నీ గళం విప్పారిన స్వరం
జై భీమ్ నాదం లా ..
స్వేచ్ఛ సమానత్వం
సౌభ్రాతృత్వం సమన్యాయంలా..
రాజ్యాంగపు హక్కుల్లా…
చదువు బోధించు
సమీకరించు శపథాల్లా..
అంబేద్కర్లారా, ఏకం కండి
అంబేద్కర్ మనలో శ్వాసిస్తున్నాడు.
ఇది పిలుపు కాదు పునర్జన్మ.
జై భీమ్…. జై భీమ్
జై భీమ్…. జై భీమ్
By Dr. Samudrala Priskilla

Comments